జీహెచ్ఎంసీ పరిధిలో ఐపీఎస్ అధికారుల ప్రక్షాళన!?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సమయం దగ్గరపడోంది. దీంతో పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన చేసేందుకు ఆలోచిస్తోంది. పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్లాన్ చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం భారీగా ఐపీఎస్ లను ప్రక్షాళన చేయబోతోందన్న టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులు ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో, విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారన్న నివేదికలు ప్రభుత్వానికి అందాయి. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్, జిల్లాల్లోని అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారుల పనితీరుపై నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో సమర్థులైన అధికారులకు పెద్దపీట వేస్తూ, ఎన్నికల వేళ శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు వీలుగా ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. రాజకీయంగా అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయడం లేదు. నగరంలో పూర్తి పట్టు సాధించాలంటే పోలీసు యంత్రాంగం తమ కనుసన్నల్లో, అత్యంత సమర్థవంతంగా పనిచేయడం మంత్రులకి, పార్టీ అధిష్టానానికి అత్యంత కీలకం. అందుకే ఎన్నికలకు ముందే రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల్లో తమకు అనుకూలమైన, సమర్థులైన అధికారులను మోహరించాలనే ఎత్తుగడ వేస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎస్ ల బదిలీలపై కసరత్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో.. 2001 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ ఏడేళ్ల కేంద్ర డిప్యూటేషన్ ముగించుకుని తిరిగి రాష్ట్రానికి వచ్చారు. డీజీపీకి రిపోర్ట్ చేశారు. ఇది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన సిట్ కు నాయకత్వం వహించి అప్పట్లో సంచలనం సృష్టించిన అకున్ సభర్వాల్‌కు ఇప్పుడు ఎలాంటి పోస్టింగ్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ దాడుల నేపథ్యంలో 2018లో నమోదైన ఈ డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, ఛార్మి, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, నవ్‌దీప్, సుబ్బరాజు తదితరులను సిట్ బృందం విచారించింది. అయితే 2024 నాటికి తగిన ఆధారాలు లేకపోవడంతో కోర్టు నటులకు సంబంధించిన ఆరు కేసులను కొట్టేసింది.
ఇప్పుడు ఇలాంటి వివాదాస్పద, హై-ప్రొఫైల్ కేసులను డీల్ చేసిన సమర్థుడైన అధికారి తిరిగి రాష్ట్రానికి రావడం, అదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి మొదలవడం యాదృచ్ఛికం కాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడానికి లేదా నగరంలో శాంతిభద్రతల నియంత్రణ పేరుతో కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి సీనియర్ అధికారుల సేవలను ఏ విధంగా వినియోగించుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి, జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార పార్టీ వేస్తున్న వ్యూహాల్లో ఈ ఐపీఎస్ ల బదిలీల అంశం కీలకమైన అస్త్రంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.








