గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వేడి.. తెరపైకి మాదిగలు!
తెలంగాణలో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ అంశం చర్చనీయాంశంగా మారింది. నవంబర్‌లో మూడు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాసనమండలిలో తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదంటూ మాదిగ సామాజిక వర్గం నుంచి వస్తున్న డిమాండ్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
నవంబర్‌లో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. వివిధ సమాజిక సమీకరణాలను బేరీజు వేస్తోంది. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎన్నికలకోసం ఇద్దరినీ రెడ్డి సమాజిక వర్గానికి చెందిన నేతలనే కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. దీంతో గవర్నర్ కోటా స్థానాలను వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పద్మశాలీ వర్గానికి చెందిన ఒకరికి ఎమ్మెల్సీ స్థానంలో ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మూడు స్థానాలలో కనీసం రెండు స్థానాలను బీసీ వర్గాలకే కేటాయించే అవకాశాలున్నట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాదిగ వర్గ నాయకులు తమకు అవకాశం కల్పించాలంటూ ఒత్తిడి పెంచారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు శాసనమండలిలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లభించలేదన్నది ఆ వర్గ నేతల ప్రధాన వాదన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కోటా కింద ఎమ్మెల్సీలుగా అవకాశం పొందిన ఎం.ఎస్. ప్రభాకర్, గొరెటి వెంకన్న ఇద్దరూ కూడా మాల సామాజిక వర్గానికి చెందినవారేనని వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అద్దంకి దయాకర్ వంటి ప్రముఖులకు మండలిలో అవకాశం కల్పించినప్పటికీ, ఆ స్థానం కూడా మాల వర్గానికే దక్కిందని మాదిగ సంఘాలు వివరిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో డి. రాజేశ్వర్ రావుకు అవకాశం దక్కినా, ఆయన ఆ తర్వాత పూర్తిగా క్రిస్టియన్ మైనారిటీ వర్గంలోకి మారారని, అలాగే కేసీఆర్ హయాంలో కడియం శ్రీహరి బైండ్ల కులానికి చెందినవారని కమ్యూనిటీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
తమ దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని, ఈసారైనా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించాలని మాదిగ నేతలు బలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రేసులో మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ. సంపత్ కుమార్, దొమ్మాట సాంమయ్య, ఇందిరా సింగపురం, దేవాని సతీశ్ మాదిగ తదితరులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రత్యేకించి, ఎంఆర్పీఎస్ ఉద్యమంతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉండి, కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్‌గా సేవలందిస్తున్న దేవాని సతీశ్ మాదిగ తదితరులు తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు.
మొత్తానికి, రాబోయే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలు కేవలం పదవుల భర్తీగానే కాకుండా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాజిక న్యాయాన్ని నిరూపించుకునే అగ్నిపరీక్షగా మారాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నాయకత్వం మాదిగల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేరుస్తారనేది వేచి చూడాలి.








