గ్లోబల్ కాన్ఫిడెన్స్ కు గమ్యస్థానంగా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్ (Hyderabad)ను కేవలం గ్లోబల్ కేపబిలిటీ (Global Confidence) సెంటర్ల గమ్యస్థానంగానే కాకుండా, ప్రపంచ స్థాయి సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగొనే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు. హైటెక్ సిటీలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన నెదర్లాండ్స్ గ్లోబల్ ఫిన్‌టెక్ దిగ్గజం బ్యాక్‌బేస్ సంస్థ డెవలప్మెంట్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ మార్కెట్ అవసరాలు, సవాళ్లు భవిష్యత్ సాంకేతిక మార్పులకు అనుగుణంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించే కాంప్రహెన్సివ్ ఎకో సిస్టంను రాష్ట్రంలో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
అనతికాలంలోనే టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్ (Digital Banking), ఫిన్‌టెక్ (Fintech) రంగాల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ కంపెనీలకు ఒక ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దాం. గ్లోబల్ కంపెనీల అవసరాలకు అనగుణంగా రాష్ట్రంలో అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అదుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నెక్ట్స్‌జనరేషన్ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్వేర్ ఉత్పత్తులను అందించడంలో ఈ బ్యాక్‌బేస్ డెవలప్మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు.








