YS Jagan: ఆయన్ను రానివ్వకూడదంటే రాకుండా ఉంటారా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సాగుతున్న అనిశ్చితికి తెరదించుతూ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం చారిత్రాత్మక తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపి, పార్లమెంటులో ఆమోదింపజేయడం ద్వారా దీనికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాలని పాలకపక్షం భావిస్తోంది. అయితే, ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని అంశం కంటే ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి జగన్ చుట్టూనే చర్చ తిరగింది.
సభలో మాట్లాడిన దాదాపు ప్రతి నేత జగన్ పేరును ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. “ఆయన మళ్లీ రాడు.. రాకూడదు.. రానివ్వబోం” అంటూ అధికార పక్ష సభ్యులు వరుసగా శాపనార్థాలు పెడుతూ, ప్రతినలు పూనారు. ఒక విధంగా చెప్పాలంటే, రాజధాని తీర్మానం కంటే జగన్ను రాజకీయంగా సమాధి చేయాలనే కక్ష, పంతమే సభలో ఎక్కువగా ధ్వనించింది. కానీ, ఇక్కడే పాలకులు ఒక ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.
ఇవి కూడా చదవండి
రాజకీయాల్లో గెలుపోటములు, అధికార మార్పిడి అనేది సహజ ప్రక్రియ. “ఆయన రాకూడదు” అని పాలకులు నిర్ణయించేది కాదు; అది ప్రజలు నిర్ణయించాల్సిన అంశం. గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని అప్పట్లో చాలామంది భావించారు. కానీ, చివరకు ఏమైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 135 సీట్లతో ఆ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. రేపు ఆ పార్టీ కూడా బౌన్స్ బ్యాక్ కావచ్చు. ఘన విజయం సాధించవచ్చు.
కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, అతడిని రానివ్వబోం అని బాకాలు ఊదుకోవడం వల్ల రాజకీయంగా కొంత మైలేజీ రావచ్చు కానీ, దాని వల్ల ఉపయోగం ఉండదు. పాలకుల భవిష్యత్తు వారి మాటలపై కాకుండా, వారి పాలనపై ఆధారపడి ఉంటుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించడం ఒక ఎత్తు అయితే, దానిని అభివృద్ధి చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మరొక ఎత్తు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరినప్పుడు, రాష్ట్రం ప్రగతిపథంలో నడిచినప్పుడు మాత్రమే పాత పాలకులు మళ్లీ వచ్చే అవకాశం ఉండదు.
రాజకీయాల్లో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు. వ్యక్తిగత దూషణలు, రాజకీయ కక్షల కంటే పాలనపై దృష్టి పెట్టడమే ఉత్తమం. ప్రత్యర్థిని రానివ్వకూడదనే పంతం కంటే, ప్రజలే ప్రత్యర్థిని వద్దనుకునేలా అద్భుతమైన పాలన అందించడమే ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న అసలైన సవాలు.
రాజధాని చట్టబద్ధత అనేది సాంకేతిక ప్రక్రియ, కానీ రాజకీయ ఆధిపత్యం అనేది ప్రజల మనసు గెలవాల్సిన ప్రక్రియ. పాలకులు కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించి, కేవలం గత పాలకుల వైఫల్యాలను ఎండగట్టడానికే పరిమితం కాకుండా, తమ మార్కు పాలనను చూపించాల్సిన సమయం ఇది. లేదంటే, చరిత్ర పునరావృతమవుతుందనేది జగమెరిగిన సత్యం.
ఇవి కూడా చదవండి








