AP Assembly: నివేదికలను వైకాపా తొక్కిపెట్టింది.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించి స్పష్టమైన నివేదికలు ఉన్నప్పటికీ, గత వైకాపా ప్రభుత్వం వాటన్నింటినీ తొక్కిపెట్టిందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈ అంశంపై ఆయన మాట్లాడే ప్రయత్నం చేయగా, ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో మండలి చైర్మన్ మోషేన్ రాజు సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఆనం మాట్లాడుతూ.. జగన్ హయాంలో లడ్డూ కల్తీకి సంబంధించిన నివేదికలను బయటకు రాకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. తమకు అనుకూలమైన వారికి ప్రయోజనం చేకూర్చేలా టెండర్ నిబంధనలను మార్చి, వ్యవస్థలను తుంగలో తొక్కారని మంత్రి పేర్కొన్నారు. కల్తీ జరగడం వాస్తవమేనని ఆనాటి తితిదే ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గతంలోనే ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలే వాస్తవాలను అంగీకరించినప్పటికీ, వైకాపా నాయకులు మాత్రం ఇంకా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ కల్తీకి సంబంధించి పూర్తి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి ఆనం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.








