Ambati Mounika: వైసీపీ వ్యూహంలో మహిళా కార్డు.. అంబటి కుటుంబంపై సాగుతున్న రాజకీయ చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహాగానాలకు ఎప్పుడూ కొదవ ఉండదు. వాస్తవంగా ఏమి జరుగుతున్నవి కాకుండా, జరగవచ్చన్న అంచనాలే చాలాసార్లు పెద్ద చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా అలాంటి ప్రచారమే ఒకటి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు సంబంధించిన ఘటనల తరువాత మొదలైన చర్చలు ఇప్పుడు ఆయన కుటుంబం వరకూ వెళ్లాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) అంబటి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం, ముఖ్యంగా ఆయన కుమార్తెలతో మాట్లాడిన తీరు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది.
గుంటూరు జిల్లా (Guntur)లోని అంబటి ఇంటికి జగన్ వెళ్లిన సమయంలో ఆయన కుమార్తె మౌనిక (Mounika) మీడియా ముందు కనిపించడం, ఇంటిపై జరిగిన దాడులకు సంబంధించిన పత్రాలు, ఫోటోలను అందించడం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. ప్రెస్మీట్లో కూడా ఆమె జగన్ పక్కనే నిలబడి సహకరించడం గమనార్హంగా మారింది. దీనితో వైసీపీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆమె పాత్రపై ఆసక్తికరమైన విశ్లేషణలు మొదలయ్యాయి.
ఇదిలా ఉండగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం (Guntur West Constituency)లో వైసీపీ భవిష్యత్ ప్రణాళికలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆ నియోజకవర్గం పార్టీకి అనుకూలంగా రాలేదు. వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి ఎదురవడంతో 2029 ఎన్నికలపై పార్టీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అంబటి రాంబాబును అక్కడ ఇంచార్జిగా నియమించడం, ఆయన రాజకీయ కార్యకలాపాలను ఆ ప్రాంతంలో పెంచడం ఈ ఆలోచనలకు బలం చేకూర్చింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి (Galla Madhavi)కి ధీటుగా ఈసారి మహిళా అభ్యర్థినే నిలబెట్టాలన్న ఆలోచన వైసీపీలో చర్చకు వస్తోందని అంటున్నారు. అంబటి ఇంటిపై దాడి ఘటన తరువాత, మౌనిక మీడియాతో మాట్లాడిన తీరు, జగన్ పరామర్శ సమయంలో ఆమె చూపిన ఆత్మవిశ్వాసం చూసిన తర్వాత ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న అభిప్రాయం కొంతమంది నేతల్లో వ్యక్తమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
మహిళా అభ్యర్థి, పైగా బాధిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే ప్రజల్లో సానుభూతి లభించే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. దీనితో పాటు మహిళా కార్డు, విక్టిమ్ కార్డు రెండూ కలిసి పనిచేస్తాయన్న లెక్కలూ వినిపిస్తున్నాయి. అంబటి రాంబాబు కూడా తన కుమార్తె రాజకీయ ప్రవేశానికి సహకరిస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటికి కేవలం ప్రచారాలే. అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. రాజకీయాల్లో ఊహాగానాలు నిజమవుతాయా లేక కాలంతో కలిసి మాయమవుతాయా అన్నది వేచి చూడాల్సిందే.






