మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
ద్విచక్రవాహనంతో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసు నుంచి తన కుమారుణ్ని తప్పించేందుకు కుట్ర పన్నిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజు (Sidiri Appalaraju)ను పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన సోంపేట కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు వరుసగా వాయిదా పడుతుండటం, పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయ్యారు. పలాసలోని ఆయన స్వగృహంలో ఉండగా అదనపు ఎస్పీ రమణ(SP Ramana), డీఎస్పీలు భవానీ ( DSP Bhavani), వివేకానంద ( Vivekanand), పోలీసులు వెళ్లారు. అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. రోడ్డు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడైన సీదిరి కుమారుడు ఆరవ్ వర్మ, వీరికి సహకరించిన అనుచరుడు సిద్ధార్థ్ త్యాడి ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్లో ఉన్నారు. వారిద్దరు దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను బుధవారం సోంపేట కోర్టు కొట్టివేసింది.








