ఇక ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ప్రయాణికుల కోసం కొత్త ప్లాన్..
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మార్చుకునే దిశగా ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కొత్త ఆలోచనలపై దృష్టి పెడుతోంది. బస్సు కోసం బస్టాండ్‌కు వెళ్లడం, అక్కడి నుంచి గమ్యస్థానానికి చేరుకోవడం అనే పద్ధతికి భిన్నంగా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే విధానాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు కొన్ని వినూత్న ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా బస్సు కోసం రోడ్డుపై చేయి చూపినప్పుడు ఆపాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఆచరణలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. బస్సుల సంఖ్య తగ్గడం, ప్రయాణికుల రద్దీ పెరగడం, సిబ్బందిపై పని భారం అధికం కావడం వంటి కారణాలతో బస్సులు ప్రతి స్టాప్‌లోనూ ఆగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవర్లు, కండక్టర్లతో వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాపై పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు ఆర్టీసీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
అందులో భాగంగా పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి టికెట్లు బుక్ చేసుకుంటే వారికి ప్రత్యేక పికప్ సౌకర్యం కల్పించే ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది. తొలుత విజయవాడ (Vijayawada) నగరంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఒకే చోట నుంచి ప్రయాణించాలనుకునే కనీసం పది మంది ముందుగా బుకింగ్ చేసుకుంటే, నిర్ణయించిన ప్రదేశానికి బస్సును పంపించి ప్రయాణికులను ఎక్కించుకునే విధానం తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దూరప్రాంత ప్రయాణాలకు ఉపయోగించే ఏసీ, నాన్ఏసీ బస్సులకు ఈ సదుపాయం వర్తింపజేయాలనే ఆలోచన ఉంది. వివాహాలు, కుటుంబ విహారయాత్రలు, విద్యార్థుల సమూహ ప్రయాణాలు, ఉద్యోగుల బృందాలు వంటి సందర్భాల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం మొత్తం బస్సును బుక్ చేసుకున్నప్పుడు లభించే సౌకర్యాన్ని, నిర్దిష్ట సంఖ్యలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రైవేటు ట్రావెల్స్‌కు ప్రత్యామ్నాయం కల్పించవచ్చని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రధాన నగరాల్లో బస్టాండ్లకే పరిమితమైన సర్వీసులను కొన్ని ముఖ్య కూడళ్ల నుంచి కూడా అందుబాటులోకి తీసుకురావడంపై పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. ప్రైవేటు బస్సులు పాటిస్తున్న ఈ విధానం ప్రయాణికులకు సమయం, రవాణా ఖర్చు రెండింటినీ ఆదా చేస్తోంది. అదే తరహాలో ఆర్టీసీ సేవలు కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత సౌలభ్యం కలగొచ్చు.
అదే సమయంలో రద్దీకి అనుగుణంగా టికెట్ ధరలను సర్దుబాటు చేయాలనే ఆలోచన కూడా ముందుకు వచ్చింది. ప్రయాణికుల డిమాండ్ తక్కువగా ఉన్న సమయాల్లో చార్జీలను కొంత తగ్గించడం ద్వారా ఖాళీ సీట్లను తగ్గించి ఆక్యుపెన్సీ పెంచుకోవచ్చని భావిస్తున్నారు. రద్దీ లేని వేళల్లో ప్రైవేటు ఆపరేటర్ల కంటే ఆర్టీసీ ధరలు ఆకర్షణీయంగా ఉంటే ఎక్కువ మంది ప్రజా రవాణాను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థ ఆదాయాన్ని పెంచేలా ఈ ప్రతిపాదనలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.








