Nara Lokesh: నిరుద్యోగులకు ఉగాది కానుక…భారీ ప్రకటనకు సిద్ధమవుతున్న నారా లోకేశ్..
ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రత్యేకంగా వినియోగించుకోనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఉగాది రోజున ఒక కీలక ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. గతంలో కూడా పెద్ద నిర్ణయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ముందుగానే ప్రజలకు సంకేతాలు ఇచ్చిన లోకేశ్, ఈసారి కూడా అదే తరహా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఈ క్రమంలోనే పెట్టుబడులను ఆకర్షించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ ఉద్యోగాలపై కూడా సమీక్ష జరిపినట్టు తెలుస్తోంది. పోలీస్, రెవెన్యూ సహా వివిధ విభాగాల్లో కలిపి 23 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏయే శాఖల్లో ఎంతమంది అవసరమో వివరాలతో కూడిన జాబితాను అధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. అంతేకాదు, ఈ ఏడాది రిటైర్ కానున్న ఉద్యోగుల వివరాలను కూడా ముందుగానే పరిశీలించి, ఆ స్థానాలు ఖాళీ కాకముందే భర్తీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.
ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి ఉగాది నాటికి ఒక సమగ్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేసే యోచనలో మంత్రి నారా లోకేశ్ ఉన్నారని సమాచారం. ఒకేసారి పోలీస్, గ్రూప్ పరీక్షలు, ఇతర శాఖల ఉద్యోగాలకు సంబంధించిన స్పష్టమైన టైమ్‌లైన్‌ను ప్రకటించే అవకాశముందని అంటున్నారు. ఉగాది రోజున ఈ ప్రకటనను గ్రాండ్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో వైసీపీ (YSR Congress Party) ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ పేరిట ప్రకటనలు చేసినా, అవి పూర్తిస్థాయిలో అమలుకాలేదన్న విమర్శలు ఉన్నాయి. 2023లో ఒకసారి మాత్రమే క్యాలెండర్ ప్రకటించి, ఆ తర్వాత ప్రక్రియ నిలిచిపోయిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. 2024లో అయితే ఆ అంశం పూర్తిగా తెరమరుగైన పరిస్థితి కనిపించింది.
అయితే కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే డీఎస్సీ (DSC) ద్వారా సుమారు 16 వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చింది. తాజాగా గ్రూప్–1, గ్రూప్–2 నియామక ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఉగాది రోజున రానున్న ప్రకటన నిరుద్యోగ యువతకు పెద్ద ఊరటనిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి … ఉగాది రోజున మంత్రి నారా లోకేశ్ చేసే ఆ కీలక ప్రకటన ఏ రూపంలో ఉంటుందన్నదానిపైనే ఉంది.






