APEDB: సింగిల్ ఎజెండా ఉద్యోగాలే.. ఏపీలో పెట్టుబడుల వేగం పెంచిన మంత్రి లోకేశ్!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని, మయూరి టెక్ పార్క్ భవనంలో ఏర్పాటు చేసిన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDB) నూతన కార్యాలయాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు.
పెట్టుబడుల హబ్‌గా ఏపీ:
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడిన లోకేశ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలార్ మిత్తల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఏపీని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఆయన గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి
వేగవంతం కావాల్సిన ప్రాజెక్టులు:
గత ప్రభుత్వం ఏపీఈడీబీని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కొత్త పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టులు త్వరగా కార్యరూపం దాల్చేలా (గ్రౌండింగ్) చూడటమే బోర్డు ప్రధాన బాధ్యతని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎంటీ కృష్ణబాబు, ఎన్.యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి








