మాస్కో అణుశక్తి మ్యూజియంను సందర్శించిన మంత్రి లోకేష్
మాస్కో (రష్యా): రష్యాలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియం (మాస్కో)ను ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.ఈ మ్యూజియం 25వేల చదరపుమీటర్ల విస్తీర్ణంలో 7అంతస్తుల్లో ఉంటుంది. సోవియట్ అణు ప్రాజెక్ట్ ప్రారంభ దశల నుంచి ఆధునిక అణుశక్తి రంగ అభివృద్ధి, భవిష్యత్తు శాస్త్రీయ అవకాశాల వరకు విస్తరించిన ప్రదర్శనలు మ్యూజియంలో ప్రత్యేకం. మ్యూజియంలో ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, శాస్త్ర ప్రయోగశాలలు, గైడెడ్ టూర్లు ఉండటం వల్ల ఇది ప్రజలకు విజ్ఞానపరమైన అనుభవాన్ని అందిస్తోంది. 2023 నవంబర్‌లో ప్రారంభమైన ఈ మ్యూజియం ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందింది. విజ్ఞానం, చరిత్ర, సాంకేతికతల సమన్వయ వేదికగా నిలుస్తోన్న ఈ మ్యూజియంను 80 దేశాలకు పైగా చెందిన 35 లక్షల మందికిపైగా సందర్శించినట్టు నిర్వాహకులు లోకేష్‌కు వివరించారు. ఒకేసారి 2,100 మంది వరకు సందర్శకులను ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. మాస్కో ప్రభుత్వం, Rosatom స్టేట్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మ్యూజియం అణుశక్తి చరిత్రను మాత్రమే కాకుండా, శాంతిపూర్వక అణు వినియోగ విజయాలను కూడా సమగ్రంగా పరిచయం చేస్తోంది.








