వీటివల్ల వారి వృత్తికి ఎలాంటి నష్టం ఉండదు : మంత్రి అనగాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 297 సబ్‌రిజిస్ట్రార్ (Sub Registrar) కార్యాలయాలుంటే జిల్లాకు ఒకటి చొప్పున 26 చోట్లే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (Registration Service Centers) ఏర్పాటు చేస్తున్నామని, వీటివల్ల డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి ఎలాంటి నష్టం కలగదని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే అపోహలో డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారని, అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. కొన్ని పార్టీల నేతలకు ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టముండదని మండిపడ్డారు. ప్రాంతాలు, కులాలు, ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారి మధ్య చిచ్చుపెట్టేందుకు చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju)కు సంబంధించిన భూమి విషయంలో జరిగిన పొరపాటును సరిచేస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని వెల్లడించారు.








