Anitha: స్నానం చేస్తుంటే డ్రోన్ లు.. అనిత కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి(Amaravati) చట్టబద్దత కల్పించేందుకు ఏపీ శాసన సభలో తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి ఉద్యమంలో మహిళా రైతుల పాత్ర చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుందని.. స్వాతంత్ర్య ఉద్యమం తరువాత అతి పెద్ద ఉద్యమం అమరావతి పోరాటమని కొనియాడారు. అమరావతి చట్టబద్ద తీర్మానం మహిళల రైతులకే అంకితం చేయాలన్నారు. గర్భిణులు, చంటి పిల్లలు, ముసలి అవ్వలు ఉద్యమంలో పాల్గొన్నారన్నారు.
శాతవాహనుల పరిపాలించి పవిత్ర స్థలం అమరావతి.. అలాంటి ప్రాంతంలో నివసించే మహిళలను అసభ్య పదజాలంతో వైసీపీ నాయకులు దూషించారని వ్యాఖ్యానించారు. అమరావతి చట్టబద్ద తీర్మానంతో పునః చరిత్ర సృష్టిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. చిన్న, సన్నకారు రైతుల రాష్ట్ర భవిష్యత్ ఆలోచించి వేల ఎకరాల భూములు ఇచ్చారని కొనియాడారు. ఒక ధర్నా, సమ్మె లేకుండా ప్రశాంతంగా రైతులు భూములు ఇచ్చారన్నారు. అమరావతి ఉద్యమం కోసం ఉత్తరాంధ్ర ప్రజలు సంఘీభావం తెలిపారన్నారు.
నారా భువనేశ్వరి అమరావతి ఉద్యమం కోసం బంగారం గాజు విరాళంగా ఇచ్చారని, టీడీపీ ప్రభుత్వంలో కేంద్రంతో మాట్లాడి అమరావతికి నిధులు తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలి.. ఇక్కడే ఇళ్లు కట్టుకున్నానని జగన్ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి(Ys Jagan) మూడు రాజధానులు బిల్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని చీకటి రోజుల్లోకి తీసుకెళ్లారని విమర్శించారు. మహిళలను పోలీసులతో కొట్టించారు. బూటుతో పొట్టలపై తన్నించారన్నారు.
న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తే వారిపై అనేక దాడులు చేశారని అనిత విమర్శించారు. మహిళ రైతులు కట్టుకున్న చీరలపై వైసీపీ నాయకులు కామెంట్స్ చేశారని, మహిళలు స్నానాలు చేస్తే డ్రోన్స్ ఎగురవేసి వారిని మానసికంగా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. మహిళల పోరాటానికి మద్దతిచ్చిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీశారని, రైతులు పాదయాత్రలో భోజనం చేసే సమయానికి టెంట్లు కూల్చి వేశారని విమర్శించారు.








