డ్రగ్స్ టెర్రరిజంపై ఏపీ పోలీసుల ‘ఈగల్’ కన్ను, మంగళగిరిలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ శాఖ(AP Police) మరో కీలక అడుగు వేసింది. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ‘ఈగల్’ (EAGLE) స్టేట్ హెడ్‌క్వార్టర్స్‌ను రాష్ట్ర డీజీపీ(DGP) హరీష్ కుమార్ గుప్తా శనివారం ప్రారంభించారు. గంజాయి సాగు, మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఈ ప్రత్యేక విభాగాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే ఈగల్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
గ్రేహౌండ్స్ తరహాలో ఈగల్ యూనిట్‌ను ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దుతున్నామని, కేవలం ఏడాదిన్నర కాలంలోనే దీనికి జాతీయ స్థాయి గుర్తింపు లభించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని గుర్తించేందుకు విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ డ్రైవ్ ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా 10 వేల టెస్టింగ్ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించనున్నారు. గంజాయి సాగును గుర్తించేందుకు డ్రోన్లు, సాటిలైట్ ఇమేజరీని వాడుతున్నారు. అలాగే డార్క్ వెబ్, డిజిటల్ లావాదేవీలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక డేటా సెంటర్ ద్వారా క్రైమ్ అనలిటిక్స్ నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు 112 ఎన్డీపీఎస్ (NDPS) కేసులు నమోదు కాగా, ఈ సంఖ్యను 200 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలవాటుగా నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, డ్రగ్ గ్యాంగ్స్ ఆర్థిక వనరులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఎన్డీపీఎస్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు రాష్ట్రంలో కొత్తగా 13 ఎన్డీపీఎస్ కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ వెల్లడించారు. మాదకద్రవ్యాల ముప్పును ‘డ్రగ్ టెర్రరిజం’గా డీజీపీ అభివర్ణించారు. అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు ఈగల్ విభాగం ప్రత్యేక దృష్టి సారించిందని, సమాజాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చడంలో ప్రజల సహకారం కూడా అవసరమని ఆయన కోరారు.








