Iran: వెంటాడి వేటాడతాం, నేతన్యాహును బ్రతకనివ్వం..!
ఇజ్రాయిల్, అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం నేపధ్యంలో ఇప్పుడు ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నేతన్యాహును(Benjamin Netanyahu )ఇరాన్ హెచ్చరించిన విధానం సంచలనంగా మారింది. మార్చి 15న ఇరాన్ తన అధికారిక వెబ్సైట్ ‘సెపా న్యూస్’ (Sepah News) ద్వారా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై నేరుగా యుద్ధం ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని మరణించారు అనే వార్తలు సంచలనం అయ్యాయి. ఆయన విడుదల చేసిన వీడియోపై కూడా అనుమానాలు నెలకొన్నాయి.
ఈ తరుణంలో అతడిని చంపే వరకు వదలం అని హెచ్చరించింది. “ఆ శిశు హంతక నేరగాడు నెతన్యాహు ఒకవేళ ఇంకా బతికే ఉంటే, అతడిని మేము వేటాడి మరీ చంపుతాం. మా పూర్తి శక్తితో అతడిని అంతం చేస్తాం” ఇరాన్ ఆర్మీ (IRGC) వార్నింగ్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా నెతన్యాహు ప్రాణాలతో లేరని, ఆయన ఏఐ (AI) రూపొందించిన వీడియోల ద్వారా ప్రజల ముందుకు వస్తున్నారని ఇరాన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రధాని క్షేమంగానే ఉన్నారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం (PMO) వివరణ ఇచ్చింది.
ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నప్పటి నుండి ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. నెతన్యాహును చంపడం ద్వారానే తమ పగ తీరుతుందని ఇరాన్ నేతలు భావిస్తున్నారు. నెతన్యాహు కూడా ఇటీవల ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ జీవితానికి ఏ భీమా లేదని.. తమ తర్వాతి లక్ష్యం ఆయనేనని పరోక్షంగా హెచ్చరించారు. ఈ పరస్పర హెచ్చరికలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇక నేడు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ వెంటనే లొంగిపోవాలని, లేదంటే దాడులు కొనసాగుతాయని హెచ్చరించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.








