US-Iran War: ఖమేనీ స్ఫూర్తితో ఐఆర్ జీసీ పోరు పథం…!
ఇరాన్ ఓ అతిపెద్ద దేశం.. గల్ఫ్ ప్రపంచంలో ప్రధానమైన దేశాల్లో ఇరాన్ ఒకటి. ఆ విషయాన్ని గుర్తించకనే గుర్తించాయి అమెరికా, ఇజ్రాయెల్. అందుకే పశ్చిమాసియాలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే… ఇరాన్ తలకొట్టాలి. యుద్ధం తొలిరోజే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ(Khamenei) ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ(larijani) కూడా హతమయ్యారు. ముఖ్య రాజకీయ నేతలే కాదు.. సైన్యంలోని కీలక కమాండర్లూ యుద్ధంలో చనిపోతున్నారు. అయినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ప్రతిఘటిస్తూనే ఉంది. ఒక నేత చనిపోతే మరో నేత బాధ్యతలు తీసుకుని యుద్ధాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దీంతో కొంతమంది కీలక కమాండర్లను, నాయకులను తుదముట్టిస్తే ఇరాన్ కుప్పకూలిపోతుందని ఇజ్రాయెల్, అమెరికా వేసిన అంచనాలు తప్పినట్లైంది.
ఇరాన్ దశాబ్దాలుగా అమెరికా, ఇజ్రాయెల్ నుంచి దాడులు ఎదురవుతాయని ఊహిస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే సన్నద్ధమవుతూ వచ్చింది. భూగర్భంలో భారీస్థాయిలో క్షిపణి నగరాలను నిర్మించింది. వేల సంఖ్యలో క్షిపణులను, డ్రోన్లను తయారు చేసింది. దీనికి తోడు గతేడాది జులైలో ఇజ్రాయెల్ చేసిన 12 రోజుల యుద్ధం.. ఒక రకంగా టెహ్రాన్‌ను అప్రమత్తం చేసిందని చెప్పాలి. ఆ పోరులో కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ సారి పాలన, సైనిక వ్యవస్థలను ముందుగానే ఇరాన్ నేతలు వికేంద్రీకరించారు. సైనిక ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినా, తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ప్రాంతీయ కమాండర్లకు ఇచ్చారు. అందుకే ప్రధాన కమాండ్ సెంటర్లలోని సైనికాధికారులు మృతి చెందినా.. గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా కిందస్థాయిలో దళాలు స్వతంత్రంగా దాడులు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ (56) కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. తండ్రి మరణించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడి ఉండొచ్చని అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేస్తున్నారు మొజ్తాబా ఉనికిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ‘‘ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో నాకు తెలియదు. ఖమేనీ స్థానంలో వచ్చిన మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆ దేశంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు’’ అని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. మొజ్తాబా మాత్రం ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు.
‘‘ఇరాన్ వ్యవస్థలో నాయకత్వం అనేది ఒక గొలుసుకట్టు లాంటిది. ఒక లింక్ తెగినా, మరో లింక్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. అగ్ర నాయకుల మరణం ఇరాన్‌కు పెద్ద దెబ్బ అయినప్పటికీ ఆ దేశం అంత త్వరగా లొంగిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరాన్‌ను ఓ ఉగ్ర సంస్థగా భావించడం కూడా ఇజ్రాయెల్ అంచనా తప్పడానికి ఓ కారణమని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఐఆర్జీసీ(IRGC)యే నడిపిస్తోందా..!
యుద్ధానికి ముందు దేశంలోని పౌర, సైనిక నాయకత్వం మొత్తం ఖమేనీ నియంత్రణలో ఉండేది. ఆయన తర్వాత అత్యంత శక్తిమంతమైంది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ). ఇందులో వేల సంఖ్యలో అధికారులు ఉంటారు. అగ్ర జనరల్స్ చనిపోయినా, కింది స్థాయి అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించి యుద్ధాన్ని లేదా పాలనను కొనసాగించేలా వారికి శిక్షణ ఉంటుంది. ఖమేనీ చనిపోవడంతో ఐఆర్‌జీసీయే దేశాన్ని నడిపిస్తోందని చాలా మంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కౌన్సిల్ కార్యదర్శి లారిజానీ మృతి చెందిన తర్వాత దేశ పగ్గాలను ఐఆర్‌జీసీయే తీసుకుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి








