ఐక్యంగా వుంటేనే మనగలం.. లేదంటే పతనమే : రాహుల్ గాంధీ
‘‘ఐక్యంగా వుంటేనే బలం, విడిపోతే పతనమైపోతాం అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇండియా కూటమిలో వ్యాఖ్యలు చేశారు. ఐకమత్యమే అందరికీ భద్రత అని కూటమి నేతలతో చెప్పుకొచ్చారు. సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 15 నిమిషాల పాటు మాట్లాడారు. బీజేపీ నుండి ఎదురయ్యే సవాలును తిప్పికొట్టడానికి మిత్రపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించారు.
ఒకరినొకరు రాజకీయంగా దెబ్బతీసుకోవడం మానుకోవాలని రాహుల్ కోరారు. “దేశం మరియు రాజ్యాంగం కోసం” బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని వారిని కోరారు.’ఓట్ల చోరీ’ వంటి అంశాలపై కొన్ని మిత్రపక్షాల నుంచి మద్దతు లభించకపోవడం పట్ల రాహుల్ ఈ సమావేశంలో తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు. అలాగే, కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే తరచుగా కాంగ్రెస్ను విమర్శిస్తూ లక్ష్యంగా చేసుకునే పార్టీలపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
మరీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ను, వామపక్షాలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ రాహుల్ ప్రసంగించినట్లు సమాచారం. వారిద్దరి వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.








