Menstrual Leaves: ‘నెలసరి సెలవులు’ తప్పనిసరి చేయాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు
మహిళలకు ప్రతి నెలా రుతుక్రమ (నెలసరి) సమయంలో తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవులు (Menstrual Leaves) మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఇలాంటి చట్టపరమైన నిబంధనలు తీసుకొస్తే ప్రైవేటు రంగంలో మహిళల ఉపాధి అవకాశాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, ఇది వారి ఎదుగుదలకు గొడ్డలిపెట్టుగా మారుతుందని హెచ్చరించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
మహిళల ఆరోగ్యపరమైన అంశాలను తాము కూడా గౌరవిస్తామని, నెలసరి ఆరోగ్యం అత్యంత కీలకమైన విషయమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే కేవలం ఈ బయోలాజికల్ కారణాన్ని చూపుతూ ప్రతి నెలా చట్టబద్ధంగా సెలవులు (Menstrual Leaves) ఇవ్వాలని కోర్టుల ద్వారా ఆదేశిస్తే, సంస్థల ఆలోచనా విధానం (వర్క్‌ప్లేస్ మైండ్‌సెట్) మహిళలకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అదనపు ఆర్థిక భారం, పనివేళల సర్దుబాటు, ప్రాజెక్టుల్లో జాప్యం వంటి కారణాలను సాకుగా చూపి.. అసలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకే కంపెనీలు వెనుకాడే వాతావరణం ఏర్పడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు వాస్తవ ప్రపంచంలో ప్రైవేటు రంగం ఎలా పనిచేస్తుందో, అక్కడి యాజమాన్యాల మనస్తత్వాలు ఎలా ఉంటాయో కనీస అవగాహన లేదని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా (Menstrual Leaves) పిటిషనర్ ఉద్దేశాన్ని సైతం న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. దశాబ్దాలుగా మహిళలు సమానత్వం కోసం పోరాడుతుంటే, ఈ పిటిషన్ వారిని వెనక్కి లాగేలా ఉందని అభిప్రాయపడింది. ‘మగవారితో ఆడపిల్లలు సమానం కాలేరని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీరు పని చేయలేరు అని వారికే పరోక్షంగా చెప్పడానికే ఈ పిల్ వేసినట్లుంది’ అంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఇప్పటివరకు ఏ ఒక్క బాధిత మహిళా (Menstrual Leaves) పని ప్రదేశంలో ఇలాంటి విధానం కావాలని కోర్టుల మెట్లు ఎక్కలేదని గుర్తుచేసిన ధర్మాసనం.. అసలు ఈ పిటిషన్ వేయడానికి పిటిషనర్‌కు ఉన్న హక్కు (లోకస్ స్టాండి) ఏమిటని నిలదీసింది. బలవంతంగా రుద్దే ఇలాంటి నిబంధనలు స్త్రీల సాధికారతకు, వారి వృత్తిపరమైన కెరీర్ ఎదుగుదలకు ప్రత్యక్షంగా ఆటంకంగా మారుతాయని కుండబద్దలు కొట్టింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సున్నితమైన (Menstrual Leaves) అంశంపై విధానపరమైన నిర్ణయం (పాలసీ మేకింగ్) తీసుకోవాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకునే అంశం కాదని చెబుతూనే, నెలసరి సెలవుల అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది. కార్పొరేట్ సంస్థలు, మహిళా సంఘాలు, ఆరోగ్య నిపుణులు సహా అన్ని సంబంధిత వర్గాలతో కేంద్రం విస్తృతంగా చర్చలు జరిపి, మహిళల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లకుండా ఒక ఆచరణాత్మకమైన విధానాన్ని రూపొందించాలని ధర్మాసనం మార్గదర్శనం చేసింది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ద్వారానే మహిళలకు నిజమైన మేలు జరుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి








