ప్రభుత్వం బిల్లును తీసుకొస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం : ఇండియా కూటమి
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఇండియా కూటమి అత్యంత కీలక ప్రకటన చేసింది. మహిళా రిజర్వేషన్ కి తాము ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని, కానీ.. కేంద్రం తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు విధానాన్ని మాత్రం వ్యతిరేకిస్తామని ఇండియా కూటమి ప్రకటించింది. ఇదంతా రాజకీయ ప్రేరేపితమేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ పార్లమెంట్ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీఎంకే నుంచి బాలు, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్, శివసేన ఉద్ధవ్ వర్గం నుంచి సంజయ్ రౌత్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, టీఎంసీ నుంచి ఓబ్రెయిన్, సీపీఐ నుంచి రాజా తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత ఖర్గే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలమే. అయితే.. కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టిన విధానం పట్ల మాకు కొన్ని అభ్యంతరాలు వున్నాయి. ఇది రాజకీయ ప్రేరేపిత చర్యే. కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికే ప్రభుత్వం ఇలా చేస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము నిరంతరం మద్దతు ఇస్తూనే వున్నాం. గతంలో ప్రతిపాదించిన సవరణలను అమలు చేయాలని మేము గట్టిగా కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
అలాగే కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కొన్ని కుతంత్రాలు పన్నుతున్నారని, ఇండియా కూటమి అంతా కలిసి దీని వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నామని ఖర్గే ప్రకటించారు. తాము మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం కానీ.. ఈ రిజర్వేషన్ కి వ్యతిరేకం మాత్రం కాదని, వారు ఈ బిల్లును ప్రవేశపెట్టిన తీరు చూస్తే, అది నియోజకవర్గాల పునర్విభజన అయినా సరే, వారు కనీసం జనాభా లెక్కలను కూడా ఆమోదించలేదని మండిపడ్డారు.
“మేము మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వం బిల్లులను తీసుకువస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాము; ఇది రాజకీయ ప్రేరేపితం,” అని ఆయన అన్నారు. అందరూ ఐక్యంగా ఉన్నారని, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నాం’’ అని ఖర్గే సమావేశం అనంతరం మీడియాతో చెప్పారు.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల చట్టసవరణ బిల్లుకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. ఈ చట్ట సవరణ బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ‘‘నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలపై చర్చించేందుకు వీలుగా ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు కూడా నడుం బిగించింది. దీంతో బడ్జెట్ సమావేశాల కాలాన్ని కూడా పొడిగించింది. దీనిని బట్టి చూస్తే ఈ బిల్లు విషయంలో ఎన్డీయే ప్రభుత్వం గట్టి పట్టుదలతో వుందని అర్థమైపోతుంది.
ఇక… ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత కీలక అడుగు వేశారు. ‘మహిళా రిజర్వేషన్ల చట్టం’ అమలులో మద్దతును కోరుతూ ప్రధాని మోదీ లోక్ సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల సభా నాయకులకు లేఖలు కూడా రాశారు.
ఇవి కూడా చదవండి








