మహిళల మనోభావాలు దెబ్బతీయొద్దు.. రండి.. చరిత్ర సృష్టిద్దాం : ఎక్స్ వేదికగా మోదీ
పార్లమెంటులో చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మరి కాసేపట్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదిగా కీలక పిలుపునిచ్చారు. చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. పార్లమెంటు తీసుకునే ఈ నిర్ణయం కోసం యావత్ మహిళా లోకం ఎంతో ఆతృతతో చూస్తోందన్నారు. మహిళల మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయవద్దని కోరారు. అందరం కలిసి చరిత్ర సృష్టిద్దామని పిలుపునిచ్చారు.
‘‘నారీ శక్తి వందన్ అధినియం’’ కి సవరణలు చేసే విషయంపై పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది. నిన్న రాత్రి ఒంటిగంట వరకూ చర్చ నడిచింది. బిల్లుల విషయంలో వున్న అపోహలను తొలగించేలా ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. నాలుగు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎన్నో రాజకీయాలు నడిచాయి. వారు తమ హక్కులను పొందే సమయం ఆసన్నమైంది. కాసేపట్లో లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు నా విన్నపం. పూర్తి పరిశీలన తర్వాత మహిళా రిజర్వేషన్ కి అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఓటు వేయండి’’ అని ఎక్స్ వేదికగా మోదీ పిలుపునిచ్చారు. మరోవైపు దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కేంద్రం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓటింగ్ కి ముందు కీలక నేతలతో భేటీ అయ్యారు. బిల్లు ఆమోదం పొందేలా సీనియర్ మంత్రులతో మంతనాలు జరిపారు. అలాగే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా విపక్షాలతో భేటీ అయ్యారు.
ఇవి కూడా చదవండి








