Nirmala Sitharaman: సవాళ్లున్నా ద్రవ్యలోటు లక్ష్యానికే కట్టుబడి ఉన్నాం: నిర్మలా సీతారామన్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు భారత వృద్ధి ప్రయాణాన్ని అడ్డుకోలేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను కచ్చితంగా చేరుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభలో గ్రాంట్ల కోసం ప్రవేశపెట్టిన రెండో బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్స్‌పై జరిగిన కీలక చర్చ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న విధంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 4.4 శాతానికే పరిమితం చేస్తామని సభకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వ అదనపు వ్యయాల కోసం రూ. 2.81 లక్షల కోట్ల అదనపు నిధులను కేటాయించేందుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. అయితే ఈ నిధుల కేటాయింపు వల్ల ద్రవ్యలోటు ఏమాత్రం పెరగదని నిర్మల (Nirmala Sitharaman) వివరించారు. ప్రభుత్వ పొదుపు చర్యలు, రిసీట్లు, ఇతర మంత్రిత్వ శాఖల రికవరీల ద్వారా ఈ మొత్తాన్ని భర్తీ చేస్తామని తెలిపారు. ఈ అదనపు నిధుల నుంచి ఏకంగా రూ. 1 లక్ష కోట్లతో ప్రత్యేకంగా ‘ఆర్థిక స్థిరత్వ నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. గ్లోబల్ సప్లయ్ చైన్ అంతరాయాలు, మార్కెట్లో ధరల అస్థిరత వంటి క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ నిధి అత్యవసర రక్షణ కవచంలా పనిచేస్తుందని మంత్రి వివరించారు.
ఇదే సమయంలో, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల దేశంలో ఎరువుల కొరత వస్తుందన్న వదంతులను నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తీవ్రంగా ఖండించారు. రాబోయే వ్యవసాయ సీజన్లలో రైతులకు ఎరువుల కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు. ఈ సప్లిమెంటరీ డిమాండ్స్‌లో ఎరువుల సబ్సిడీ కోసం అదనంగా రూ. 19,230 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం అందిస్తున్న మొత్తం ఎరువుల సబ్సిడీ ఏకంగా రూ. 1.86 లక్షల కోట్లకు చేరుకుందని ఆమె పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఒకవైపు ఆర్థిక మంత్రి (Nirmala Sitharaman) సభలో ఆర్థిక పటిష్టతపై భరోసా ఇస్తున్నప్పటికీ, దేశంలో తీవ్రంగా ఉన్న కమర్షియల్, గృహోపయోగ ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరతను ఎత్తిచూపుతూ విపక్షాలు సభను హోరెత్తించాయి. గ్యాస్ కొరతతో సామాన్యులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారంటూ పార్లమెంటు లోపలా, బయటా ప్రతిపక్ష నేతలు తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి








