తమిళనాడులో ‘విజయ్’ ప్రభంజనం.. యాభై ఏళ్ల రికార్డులు బద్దలు!
Tamil Nadu: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ద్వంద్వాధిపత్యానికి తెరదించుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలన ఫలితాలను నమోదు చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, ఉదయం 10:30 గంటల సమయానికే టీవీకే ఏకంగా 32 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
ప్రస్తుతం ఇలా..
- డీఎంకే+: 54
- టీవీకే: 47
- ఏఐఏడీఎంకే: 34+
బద్దలైన కోటలు..
గత 50 ఏళ్లుగా తమిళనాడును శాసిస్తున్న రెండు ప్రధాన పార్టీల బైనరీ రాజకీయాలను విజయ్ బద్దలు కొట్టారు. కేవలం అభిమాన గణమే కాకుండా, పట్టణ , పారిశ్రామిక ప్రాంతాల్లోని యువత ఓట్లు టీవీకే వైపు మొగ్గు చూపాయి. ముఖ్యంగా డీఎంకే కంచుకోటలుగా భావించే చెన్నై ఉప ప్రాంతాల్లోనూ, వెల్లూరు, కాంచీపురం వంటి ఉత్తర జిల్లాల్లోనూ టీవీకే అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తూ ముందంజలో ఉన్నారు. డజనుకు పైగా స్థానాల్లో టీవీకే అభ్యర్థులు 3,000 ఓట్ల కంటే ఎక్కువ ఆధిక్యంలో ఉండటం విశేషం.
ఏ కూటమి కూడా ఆ మార్కును అందుకునేలా..
తమిళనాడు అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుతం ఏ కూటమి కూడా ఆ మార్కును అందుకునేలా కనిపించడం లేదు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగి విజయ్ 30 నుండి 40 సీట్లు గెలుచుకుంటే, ఆయనే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే విజయ్ మద్దతు తప్పనిసరి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటుతుండగా, గ్రామీణ ప్రాంతాల ఈవీఎంల లెక్కింపుపై ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఏది ఏమైనా, విజయ్ ఎంట్రీతో తమిళ పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.








