War: హర్మూజ్ జలసంధిలో ముదిరిన అగ్గి.. అమెరికా, ఇరాన్ మధ్య భీకర నౌకా యుద్ధం
చమురు రవాణాకు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుతం యుద్ధ భూమిగా మారింది. సముద్ర మార్గంలో మందుపాతరలు (మైన్స్) వేసేందుకు ఇరాన్ మోహరించిన 16 మైన్ లేయింగ్ నౌకలను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు భీకర దాడులతో ధ్వంసం చేశాయి. ఈ దాడులతో జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. దీనికి ప్రతిచర్యగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న మూడు సరకు రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులకు గురైన నౌకల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ‘మయూరి నారీ’ కూడా ఉంది. ఇది భారత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తుండగా ఒమన్ తీరం వద్ద దాడికి గురైంది. ఈ నౌకలోని 20 మందిని ఒమన్ నేవీ రక్షించగా, మరో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది.

డ్రోన్లతో పేలుళ్లు..
యుద్ధం 12వ రోజుకు చేరిన తరుణంలో ఇటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్, లెబనాన్‌లలోని పౌర లక్ష్యాలపై దాడులు ముమ్మరం చేసింది. బీరుట్లో జరిగిన దాడుల్లో భారీ అపార్ట్మెంట్లు కూలిపోయాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో మొత్తం 1,878 మంది మరణించగా, 15,753 మంది గాయపడ్డారు. లెబనాన్‌లో దాదాపు 7.8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారనే వార్తలు వచ్చినా, ఆయన సురక్షితంగానే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ తన డ్రోన్లతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుళ్లు సృష్టించింది. ఈ ఘటనలో భారతీయుడితో సహా నలుగురు గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. ట్రంప్ ప్రకటనతో మొదట కోలుకున్న స్టాక్ మార్కెట్లు, దాడులు తీవ్రం కావడంతో మళ్లీ కుప్పకూలాయి. భారత్‌లో సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే చమురు ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, ఖతార్లపైకి ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఆయా దేశాల సైన్యాలు అడ్డుకున్నాయి. పశ్చిమాసియాలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పాటు ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల మౌలిక వసతులపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ట్రంప్ మాట్లాడుతూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ, ఇరాన్లో విధ్వంసం తాము అనుకున్న ప్రణాళిక కంటే వేగంగా జరుగుతోందని, త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తామని పేర్కొన్నారు. చమురు కొరత ఏర్పడకుండా అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) చరిత్రలోనే మొదటిసారిగా 400 మిలియన్ బ్యారెళ్ల అత్యవసర చమురు నిల్వలను విడుదల చేసేందుకు అంగీకరించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికా, బ్రిటన్లకు చెందిన వేలాది మంది పౌరులు గల్ఫ్ దేశాల నుండి స్వదేశాలకు వెళ్లిపోతున్నారు.








