Tehran: పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్.. ఇరాన్‌ను పూర్తిగా అంతం చేస్తామన్న ట్రంప్!
Tehran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు మరో కీలక నగరం ఖజ్విన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా టెహ్రాన్ స్క్వేర్‌లో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగా ఈ ఘటనలు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడులకు బాధ్యులెవరనేది అధికారికంగా వెల్లడి కానప్పటికీ, గతంలోనే ఈ నగరాలపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యం ఉంది.
ఇవి కూడా చదవండి
ట్రంప్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్ నేతలకు హెచ్చరిక:
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. “మతి చెడిన ఇరాన్ నేతలకు ఈరోజు ఏం జరుగుతుందో మీరే చూడండి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే నామరూపాల్లేకుండా పోయిందని, ఇకపై వైమానిక దళం కూడా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ దేశ క్షిపణి వ్యవస్థలు, డ్రోన్లు, నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెడుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.
అమాయకుల ప్రాణాలు.. లొంగుబాటు దిశగా:
గత 47 ఏళ్లుగా ఇరాన్ పాలకులు అమాయకులను వేధిస్తున్నారని, అమెరికా అధ్యక్షుడిగా వారిని అంతం చేస్తున్నానని ట్రంప్ ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన జీ7 దేశాల వర్చువల్ సమావేశంలోనూ ఇరాన్ త్వరలోనే లొంగిపోబోతోందని ఆయన ఇతర దేశాల నేతలకు వెల్లడించినట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ వీధుల్లో బాంబుల మోత వినిపిస్తున్నప్పటికీ, వేలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి








