ఇరాన్ హిట్ లిస్ట్ రెడీ.. టార్గెట్ ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..!
పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తోంది. శాంతి ఒప్పందం ఆశలు రేపినా..వాణిజ్యనౌకపై ఇరాన్ దాడులు. పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చాయి. దీంతో అమెరికా.. ఇరాన్ పై ముప్పేట దాడులు తీవ్రతరం చేసింది.మరోవైపు.హర్మూజ్ లో పయనిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ దాడులు తీవ్రం చేసింది. ఈ తరుణంలో తన తండ్రి మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ప్రకటించడం పరిస్థితి మరింత ఉద్రిక్తం చేసింది. ఇందులో భాగంగా ఇరాన్‌లోని స్థానిక మీడియా.. 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివేంజ్ లిస్ట్‌ను ప్రచురించింది. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా పలువురు యూరప్ నేతల పేర్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని.. దానిని కచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతీకార జాబితా బయటకు రావడం చర్చనీయాంశమైంది.
ఇరాన్ (Iran) వ్యాప్తంగా పదుల సంఖ్యలో లక్ష్యాలపై తాము దాడి చేశామని, వాటిలో క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, మందుగుండు సామగ్రి డంప్‌లు, కమ్యూనికేషన్ సాధనాలు, చిన్న బోట్ల వంటివి ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అనంతరం గల్ఫ్‌లోని పలు దేశాల్లో సైరన్లు వినిపించాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్‌లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజాగా ఇరాన్ ప్రకటించింది. బహ్రెయిన్‌లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్, రెండు క్షిపణి లాంచర్లు, క్షిపణులను నిల్వ చేసిన గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అగ్రరాజ్యం చేస్తోన్న దాడులతో పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఇంతకాలంగా జరిగిన దౌత్యచర్చలు నిరుపయోగంగా మారాయని టెహ్రాన్ దుయ్యబట్టింది. అమెరికా వల్లే హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి అంతరాయం ఏర్పడిందని ఆరోపించింది.








