Super Car: సముద్ర గర్భంలో దూసుకెళ్లే ‘సూపర్ కార్’.. అద్భుతమైన మినీ జలాంతర్గామి రాక!
రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే సూపర్ కార్లను (Super Car) మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఏకంగా సముద్రం అడుగున అదే తరహాలో ప్రయాణించే అద్భుతమైన వాహనం వచ్చేసింది. పగడపు దిబ్బలు, సాగర గర్భంలోని వింతలను అత్యంత వేగంగా, విలాసవంతంగా వీక్షించేందుకు ఒక ‘అండర్ వాటర్ సూపర్ కార్’ (సబ్మెర్సిబుల్) సిద్ధమైంది. నీటి అడుగున ప్రయాణించే వాహనాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న డచ్ కంపెనీ ‘యూ-బోట్’ (U-Boat) దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది.
డాల్ఫిన్ల వేగంతో పోటీపడుతూ..
సాధారణంగా ఇలాంటి చిన్నపాటి జలాంతర్గాములు గంటకు 7 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో మాత్రమే ప్రయాణిస్తాయి. కానీ ఈ సూపర్ కార్ (Super Car) ఏకంగా గంటకు 18.5 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సబ్మెర్సిబుల్గా ఇది రికార్డు సృష్టించింది. సముద్రంలో డాల్ఫిన్లు కూడా దాదాపు ఇదే వేగంతో ప్రయాణిస్తాయి. ఇది నీటిలో పైకి, కిందకు 45 డిగ్రీల కోణంలో సునాయాసంగా ప్రయాణించగలదు. ఇందులోని ‘షార్క్ కంట్రోలర్’, హైడ్రోడైనమిక్ డిజైన్, అత్యాధునిక చోదక వ్యవస్థల వల్ల నీటిలో విమానం గాల్లో తేలినంత సాఫీగా పయనిస్తుంది.
ఇవి కూడా చదవండి
అద్భుతమైన వ్యూ..
ఈ మినీ జలాంతర్గామిలో పైలట్‌తో పాటు మరో ఇద్దరు (మొత్తం ముగ్గురు) ప్రయాణించవచ్చు. ఇది సముద్ర ఉపరితలం నుంచి 300 మీటర్ల లోతు వరకు సురక్షితంగా వెళ్లగలదు. ఈ వాహన (Super Car) బాడీ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా డిజైన్ చేశారు. దీనివల్ల లోపల కూర్చున్న వారు సముద్ర ప్రపంచాన్ని నలువైపులా స్పష్టంగా వీక్షించవచ్చు. భద్రత కోసం ఇందులో అత్యాధునిక ‘వైడ్ యాంగిల్ సోనార్’ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే, ప్రయాణికులు ప్రాణాలతో ఉండేలా 96 గంటల పాటు సరిపడా ఆక్సిజన్, ఇతర జీవనాధార వ్యవస్థలు ఇందులో ఉంటాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తుది దశ పరీక్షలు..
అవసరాన్ని బట్టి ఈ సబ్మెర్సిబుల్ను భారీ నౌకలతో అనుసంధానించవచ్చు లేదా విడిగా కూడా ఆపరేట్ చేయవచ్చు. ప్రస్తుతం వెనెజువెలాకు ఉత్తరాన ఉన్న ‘కురాకావో’ దీవి వద్ద దీనికి (Super Car) సంబంధించిన తుది పరీక్షలు జరుగుతున్నాయి. కొద్ది వారాల్లోనే దీన్ని యజమానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సబ్మెర్సిబుల్ ముఖ్య ఫీచర్లు ఇవే..
ధర: సుమారు 57.5 లక్షల డాలర్లు
కొలతలు: పొడవు 6.5 మీటర్లు, వెడల్పు 3.27 మీటర్లు
బ్యాటరీ సామర్థ్యం: 62 kWh (ఏకబిగిన 8 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది)
చోదక వ్యవస్థ (మోటార్లు): నాలుగు 25 kW మోటార్లు, రెండు 6 kW మోటార్లు
ఇవి కూడా చదవండి







