AIA: శాన్ హోసెలో అంబరాన్నంటిన హోళీ సంబరాలు..15 వేల మందికి పైగా హాజరు
కాలిఫోర్నియాలోని శాన్ హోసె డౌన్‌టౌన్ (డిస్కవరీ మెడో) వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) మరియు బాలీ 92.3 సంయుక్తంగా నిర్వహించిన హోళీ ఫెస్ట్ అత్యంత వైభవంగా జరిగింది. బే ఏరియాలోని 50కి పైగా భారతీయ స్వచ్ఛంద సంస్థల మద్దతుతో జరిగిన ఈ వేడుక రంగుల మయంగా, ఆహ్లాదకరంగా సాగింది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ వేడుకకు సుమారు 15,000 మందికి పైగా సందర్శకులు తరలివచ్చారు. ఈ వేడుకకు కాంగ్రెస్ సభ్యుడు సామ్ లిక్కార్డో, అసెంబ్లీ సభ్యుడు యాష్ కాల్రా, ఫ్రీమాంట్ మేయర్ రాజ్ సల్వాన్, కాంగ్రెస్ సభ్యుడు ఖన్నా కార్యాలయం నుండి టామ్ పైక్, శాంటా క్లారా కౌంటీ సూపర్వైజర్ బెట్టీ దుయాంగ్, శాన్ జోస్ డౌన్‌టౌన్ అసోసియేషన్, బ్రియాన్ కర్ట్జ్, సన్నీవేల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు మురళి శ్రీనివాసన్, ఫ్రీమాంట్ సిటీ కౌన్సిల్ సభ్యుడు యాంగ్ షావో, శాన్ జోస్ సిటీ కౌన్సిల్ సభ్యులు డొమింగో కాండెలా, బియెన్ డోన్ మరియు డేవిడ్ కోహెన్ హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులు సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ హోళీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఎఐఎ చేస్తున్న కృషిని వారు కొనియాడారు. ఇక్కడి వేడుకలను చూస్తుంటే తాము భారతదేశంలో ఉన్నామా అనిపిస్తోందని పేర్కొంటూ, ఈ ఈవెంట్‌ను మరపురానిదిగా తీర్చిదిద్దినఎఐఎ బృందాన్ని అభినందించారు. పలువురు ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికల ద్వారా ఫోటోలను మరియు స్ఫూర్తిదాయకమైన సందేశాలను పంచుకున్నారు.
ఈ భారీ ఈవెంట్‌కు సంజీవ్ గుప్తా సిపిఎ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించగా, ప్లాటినం స్పాన్సర్‌గా రియల్టర్ లావణ్య దువ్వి, ట్రావెల్ పార్ట్నర్గా ట్రావలోపాడ్ వ్యవహరించింది. రియల్టర్ నాగరాజ్ అన్నయ్య, మంత్ర ఇండియా మరియు చాట్ భవన్ ఫుట్ స్పాన్సర్లుగా వ్యవహరించి ఆహార సౌకర్యాలను అందించాయి. ఇన్‌స్టా సర్వీస్, ఆజాద్ ఫైనాన్షియల్స్, అపెక్స్, కావ్య ఫుడ్స్, వాచీ సిల్క్, మై పర్సు వంటి పలు సంస్థలు కూడా సహకారం అందించాయి.
హోళీ పండుగ రాధాకృష్ణుల మధ్య ఉన్న అనంతమైన, దైవిక ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. అలాగే, ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. వసంత కాలం రాకను, శీతాకాలం ముగింపును సూచిస్తూ, సమృద్ధిగా పంటలు పండాలని కోరుకునే ప్రార్థనగా కూడా హోళీని జరుపుకుంటారు.
భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 50కి పైగా కమ్యూనిటీ సంస్థలు ఈ వేడుకకు మద్దతుగా నిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన స్వచ్ఛంద సేవకులకు మరియు సహకరించిన అన్ని సంఘాలకు, స్పాన్సర్లకు ఎఐఎ బృందం కృతజ్ఞతలు తెలియజేసింది.
ఎఐఎ గురించి:
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ప్రజల సాంస్కృతిక, సామాజిక సంబంధాలను పెంపొందించడం మరియు మన గొప్ప వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించడం ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.








