కృష్ణ పాట చూసి ఫిదా అయిన ఆదిశేషగిరిరావు.. ‘పోలీస్ కంప్లైంట్’ టీమ్‌కు అభినందనలు
హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార గీతాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాట అద్భుతంగా వచ్చిందని ప్రశంసిస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని తన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సూపర్‌స్టార్ కృష్ణపై రూపొందించిన ఈ గీతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “సూపర్‌స్టార్ కృష్ణ గారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు మా చిత్రాన్ని, ముఖ్యంగా కృష్ణ గారిపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మెచ్చుకోవడం మా యూనిట్‌కు ఎంతో గర్వకారణం. ఆయన ఆశీర్వాదాలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ చిత్రాన్ని 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ సాగుతుంది. హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు.
హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, “మా అభిమాన హీరో సూపర్‌స్టార్ కృష్ణ గారిపై రూపొందించిన పాటలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ పాటను కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరిరావు గారు చూసి ప్రశంసించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దర్శకుడు సంజీవ్ మేగోటి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇండస్ట్రీలో ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. అందరూ థియేటర్లలో సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఆదిశేషగిరిరావు ఆశీర్వాదాలతో అంచనాలు మరింత పెరిగాయి. హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్నమైన సినీ అనుభూతిని అందించనుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు ప్రత్యేక గీతాలు కూడా మంచి స్పందనను సొంతం చేసుకోవడంతో ‘పోలీస్ కంప్లైంట్’పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.








