హోదా పెరిగినా జీతం పెరగట్లేదు.. జాబ్ మార్కెట్‌పై ‘ఇండీడ్’ ఆసక్తికర నివేదిక
కార్పొరేట్ ప్రపంచంలో ప్రస్తుతం కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఉద్యోగులు చేస్తున్న పనులకు, వారికి ఇస్తున్న హోదాలకు, వారు అందుకుంటున్న జీతభత్యాలకు (Jobs Market) మధ్య తీవ్రమైన అంతరం ఉంటోందని ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఇండీడ్’ (Indeed) సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా మే, జూన్ నెలల్లో 1,211 కంపెనీలు, 2,533 మంది ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
హోదా పెద్దది.. జీతం చిన్నది
కార్యాలయాల్లో గుర్తింపు, ప్రతిఫలాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని ఈ సర్వే ఎత్తిచూపింది. తమ ఉద్యోగ హోదా.. తమ జీతభత్యాలను (Jobs Market) ఏమాత్రం ప్రతిబింబించడం లేదని ప్రతి 10 మంది వృత్తి నిపుణుల్లో ఆరుగురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ వినడానికి ఆకర్షణీయంగా ఉండే ఉద్యోగ హోదాలు (Fancy Titles) ఇవ్వడం సర్వసాధారణం అయిపోయిందని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత రెండేళ్ల వ్యవధిలో ప్రమోషన్ లేదా హోదాలో మార్పు పొందిన ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు.. తమ జీతంలో ఎలాంటి పెరుగుదల లేదని లేదా 5 శాతం కంటే తక్కువ హైక్ మాత్రమే వచ్చిందని వాపోయారు.
కెరీర్ భవిష్యత్తు వర్సెస్ జీతం
మరో కంపెనీలోకి మారేటప్పుడు హోదా ముఖ్యమా? జీతం ముఖ్యమా? అనే ప్రశ్నకు ఉద్యోగులు (Jobs Market) ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మెరుగైన హోదా కంటే ఎక్కువ జీతానికే ప్రాధాన్యత ఇస్తామని 52 శాతం మంది స్పష్టం చేశారు. అయితే ఉద్యోగులు హోదాలను పూర్తిగా పక్కనపెట్టడం లేదు. తమ హోదా భవిష్యత్ కెరీర్ అవకాశాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని 70 శాతం మంది విశ్వసిస్తున్నారు. ఒక బలమైన హోదా తమను రిక్రూట్ చేసుకోవాలనుకునే ఇతర కంపెనీల దృష్టిలో మంచి గుర్తింపు తెస్తుందని 73 శాతం మంది భావిస్తున్నారు. అలాగే ఉద్యోగ సంతృప్తిపై హోదా ప్రభావం ఉంటుందని 57 శాతం మంది చెప్పారు.
కంపెనీల వ్యూహం ఏంటంటే..
ఉద్యోగులు హోదాలకు విలువ ఇస్తూనే, దానికి తగ్గట్లుగా జీతభత్యాలు ఉండాలని ఆశిస్తున్నారు. అయితే కంపెనీలు మాత్రం వ్యూహాత్మకంగా (Jobs Market) వ్యవహరిస్తున్నాయి. తమ సంస్థలోని ప్రతిభావంతులను అట్టిపెట్టుకోవడానికి లేదా కొత్తవారిని ఆకర్షించడానికి సీనియర్ హోదాలను లేదా ఉన్నతమైన జాబ్ టైటిల్స్‌ను వాడుతున్నామని 57 శాతం కంపెనీలు అంగీకరించాయి. ముఖ్యంగా వేతనాల పెంపునకు బడ్జెట్ పరిమితంగా ఉన్న పరిస్థితుల్లో, టాలెంట్‌ను నిలుపుకునేందుకు ‘హోదాల’ పెంపును ఒక ఆకర్షణీయమైన సాధనంగా కంపెనీలు వాడుకుంటున్నాయని ఈ నివేదిక స్పష్టంచేసింది.








