బ్లింకిట్, జెప్టోలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. నోటీసులు
ఆన్లైన్లో ఆర్డర్ పెడితే పది నిమిషాల్లోనే వస్తువులను ఇంటికి చేర్చే ‘క్విక్ కామర్స్’ (Quick Commerce) సంస్థల డార్క్ స్టోర్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. టీజీ సేఫ్ (TG SAFE – తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ నగరంలోని క్యూర్ (CURE) పరిధిలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. ప్రముఖ సంస్థలైన బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోలకు చెందిన సుమారు 20 డార్క్ స్టోర్లలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.
గాలికొదిలేసిన పరిశుభ్రతా ప్రమాణాలు
ఈ తనిఖీల్లో ఆయా సంస్థల (Quick Commerce) డార్క్ స్టోర్లలో పరిశుభ్రతా ప్రమాణాలు దారుణంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దుమ్ము, ధూళితో కూడిన వాతావరణంలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వాటికి అవసరమైన సరైన ఉష్ణోగ్రతలను మెయింటైన్ చేయకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా గడువు ముగిసిన (Expired) కొన్ని ఆహార పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ స్టోర్లలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరగా పాడైపోయే ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలో నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించినట్లు వెల్లడించారు.
నోటీసులు జారీ.. ల్యాబ్‌కు శాంపిల్స్
నిబంధనలకు విరుద్ధంగా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా వ్యవహరించిన (Quick Commerce) సదరు డార్క్ స్టోర్ల నిర్వాహకులకు అధికారులు తక్షణమే నోటీసులు జారీ చేశారు. కల్తీ లేదా నాణ్యతా లోపం ఉందనే అనుమానం ఉన్న ఆహార పదార్థాల నమూనాలను (శాంపిల్స్) సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఈ ల్యాబ్ పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కస్టమర్లకు వేగవంతమైన డెలివరీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, ఆహార భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. నగరంలోని డార్క్ స్టోర్ల నాణ్యతా ప్రమాణాలపై ఈ తరహా ప్రత్యేక నిఘా భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగుతుందని అధికారులు తేల్చిచెప్పారు.








