కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
లండన్, ఆగస్టు 22: లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కి చెందిన విద్యావేత్తలతో ఆయన సమాలోచనలు జరిపారు. తెలంగాణ రైజింగ్ అధికారిక ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వం వహించారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, కె. రామకృష్ణ రావు, జయేశ్ రంజన్ తో కలిసి హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు ఉన్న అవకాశాలను కేంబ్రిడ్జ్ బృందానికి వివరించారు.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు భాగస్వాములు కావాలని వారు కోరారు.
కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో భారత ప్రభుత్వం తరపున సేవలు అందిస్తున్న ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ వెంకట సెరిష్ గండికోట, తెలంగాణతో భాగస్వామ్యం చేసుకునేందుకు ఆసక్తి చూపించారు.
హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, పరిశోధన, వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం కల్పించడం, కొత్త స్టార్టప్‌లను అభివృద్ధి చేయడం వంటి అంశాల్లో తెలంగాణ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కలిసి పనిచేసేందుకు ఒక ప్రత్యేక సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇరు పక్షాలు ఈ సందర్భంగా అంగీకరించాయి.








