ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి లోకేష్
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అనేదే మా సిద్ధాంతం
సమాజంలో మార్పు కోసం విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలి
క్రీడల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ‘షీ ప్లే’ విధానం
భీమిలిలో దివీస్ ల్యాబ్ సహకారంతో ఆధునీకరించిన జడ్పీ ఉన్నత పాఠశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి.. సరదాగా వాలీబాల్ ఆట
విశాఖ: విశాఖ జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలను ‘ప్రాజెక్ట్ చంద్రా’లో భాగంగా దివీస్ ల్యాబ్స్ సహకారంతో ఆధునీకరించిన అనంతరం రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పాఠశాలకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆధునీకరించిన తరగతి గదులు, క్రీడా మైదానాలు, ఇతర మౌలిక వసతులను మంత్రి లోకేష్ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్ సరదాగా కాసేపు వాలీబాల్ ఆడారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విద్యార్థులతో ప్రత్యేక ముఖాముఖి
సాధారణ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు భిన్నంగా ఈసారి మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సరదాగా, స్ఫూర్తిదాయకంగా సమాధానాలు ఇచ్చారు.
విద్యార్థి ప్రశ్న: ఇంతకుముందు మీరు చూసిన చంద్రంపాలెం పాఠశాలకు, ఇప్పుడు చూస్తున్న పాఠశాలకు ఉన్న తేడా ఏంటి?
మంత్రి సమాధానం: “చంద్రంపాలెం పాఠశాలకు నేను గతంలో రెండుసార్లు వచ్చినప్పుడూ రెండుసార్లు వర్షం పడింది. గతంలో పాఠశాల పరిసరాలు బురదమయంగా ఉండేవి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆధునీకరించడంతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. నేను పైలెట్ ప్రాజెక్ట్ కింద మంగళగిరిలో ఆధునీకరించిన పాఠశాలకు కూడా మూడుసార్లు వెళ్లలేదు. కానీ ఈ చంద్రంపాలెం జెడ్పీ పాఠశాలకు మాత్రం మూడు సార్లు వచ్చాను. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇదే విధంగా అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం” అని అన్నారు.
విద్యార్థి ప్రశ్న: మీకు ఇష్టమైన ఆట ఏంటి? ఇప్పటికీ ఆడుతున్నారా?
మంత్రి సమాధానం: ప్రతి భారతీయుడిలాగే నాకు క్రికెట్ అంటే ఇష్టం. ప్రతి ఆదివారం నా కుమారుడు దేవాన్ష్‌తో కనీసం రెండు గంటలైనా క్రికెట్ ఆడతాను. అంతకుమించి ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇవ్వడం లేదు” అని సరదాగా వ్యాఖ్యానించారు.
విద్యార్థిని ప్రశ్న: క్రీడల్లో మహిళలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి కదా?
మంత్రి సమాధానం: “ఇది వాస్తవమే. క్రీడల్లో మహిళలు రావడానికి అనేక అడ్డంకులు వస్తున్నాయి. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, పాఠశాలల్లో సరైన క్రీడా వసతులు లేకపోవడం, ఇలా ఏదైనా కావొచ్చు. మహిళలు క్రీడా రంగంలో అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అందుకే మహిళలను క్రీడల్లో మరింతగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘షీ ప్లే’ విధానాన్ని తీసుకొస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేసి బాలికలకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. చంద్రంపాలెం పాఠశాలలోనే ఇద్దరు విద్యార్థినులు బాస్కెట్‌బాల్ రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. ఇలానే రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థినులు క్రీడా రంగంలోకి రావాలి” అని ఆకాంక్షించారు. తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి ఉదాహరణను ప్రస్తావిస్తూ.. శ్రీచరణిని కూడా మొదట్లో క్రికెట్ ఆడేందుకు తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ఆడేందుకు అవకాశం కల్పిస్తేనే 10వ తరగతి పరీక్షలు రాస్తానని చెప్పడంతో చివరకి ఆడేందుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు తను వరల్డ్ లోనే ఉత్తమ బౌలర్. ప్రతిభకు సరైన అవకాశం లభిస్తే మహిళలు ప్రపంచ స్థాయిలో రాణించగలరనడానికి శ్రీచరణినే నిదర్శనం” అని అన్నారు.
విద్యార్థి ప్రశ్న: చిన్నప్పుడు తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు ఎలా స్పందించేవారు?
మంత్రి సమాధానం: “నా చదువు విషయంలో మా అమ్మ ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించేవారు. ఒకసారి నా రిపోర్ట్ కార్డు మీద మా అమ్మ సంతకాన్ని పెడదామని ప్రయత్నించి దొరికిపోయా. తప్పుడు మార్గాల్లో వెళ్ళకుండా మా అమ్మ నన్ను క్రమశిక్షణతో పెంచింది, నన్ను చదివించి, అన్ని విషయాలు నేర్పించింది మా అమ్మే. నేను ఈ స్థాయికి రావడానికి మా అమ్మే ప్రధాన కారణం. నాన్న నా మార్కులు గురించి పట్టించుకునే అంత సమయం ఉండేది కాదు.
విద్యార్థి ప్రశ్న: రాజకీయాల్లోకి రాకపోతే ఏ వృత్తిని ఎంచుకునేవారు?
మంత్రి సమాధానం: “2005లో చంద్రబాబు ఓడిపోయిన సమయంలో ఆయనతో కలిసి ఓ వివాహ కార్యక్రమానికి నేను వెళ్లాను. అక్కడ సుమారు 5 వేల మంది చంద్రబాబు రాగానే గౌరవంగా లేచి నిలబడటం చూశాను. ఒక వ్యక్తికి ప్రజలు ఇచ్చే గౌరవాన్ని అక్కడ ప్రత్యక్షంగా చూశాను. రాజకీయాల్లోకి రావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.
విద్యార్థి ప్రశ్న: పదో తరగతి ఫలితాలపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని ఎందుకు అనిపించింది?
మంత్రి సమాధానం: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా చర్యలు తీసుకున్నాను. ప్రభుత్వ బడుల్లో చదువుకొని ప్రతిభ కనబరిచిన విద్యార్ధుల ఫొటోలను కచ్చితంగా పత్రికా ప్రకటనల్లో చూడబోతామని మొదట్లోనే నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల కష్టానికి నిదర్శనం. వారి ప్రతిభ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా కేవలం విద్యార్థుల ఫొటోలతో ప్రకటనలు ఇచ్చాం” అని వివరించారు.
విద్యార్థి ప్రశ్న: మీరు దేవుడిని నమ్ముతారా? మీకిష్టమైన దేవుడు ఎవరు?
మంత్రి సమాధానం: “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనేది మా సిద్ధాంతం. సమాజం పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయం చేయాలి సాయం చేసే గుణం ఉంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలగుతాం. అప్పుడు మీలోనే దేవుడు కనబడతాడు” అని అన్నారు.
విద్యార్థి ప్రశ్న: విద్యార్థి దశలో మీకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏమిటి?
మంత్రి సమాధానం: “భారీ వర్షాలు పడినప్పుడు పాఠశాలకు సెలవు ప్రకటిస్తారనే విషయం నాకు చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు మీకు వర్షం పడినా సెలవు ప్రకటించే అవకాశం లేదు” అంటూ విద్యార్థులను నవ్వించారు.
విద్యార్థి ప్రశ్న: ‘మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?’
మంత్రి సమాధానం: అది సీక్రెట్ అని సరదాగా సమాధానమిచ్చిన మంత్రి. “పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య సమయంలో ఏర్పడే స్నేహాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. తల్లిదండ్రుల తర్వాత స్నేహితులతోనే మన భావాలను ఎక్కువగా పంచుకుంటాం. జీవితంలో ఏ స్థాయికి వెళ్లినా మంచి స్నేహితులను మర్చిపోవద్దు. తల్లి, తండ్రి, గురువు తర్వాత స్నేహమే ముఖ్యం” అని అన్నారు.
విద్యార్థులను సరదాగా ప్రశ్నలు అడిగిన మంత్రి లోకేష్.. డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, సైంటిస్ట్, టీచర్, బిజినెస్మెన్ వంటి వృత్తుల్లోకి వెళ్లాలని ఎంతమంది కోరుకుంటున్నారో అడిగారు. అనంతరం రాజకీయాల్లోకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారని ప్రశ్నించారు. సమాజంలో తాము కోరుకునే మార్పు తీసుకురావాలంటే విద్యావంతులు, ఆలోచించే యువత పెద్దఎత్తున రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. రాజకీయాలు కేవలం పదవులు, ఎన్నికలకు పరిమితం కాదని, ప్రజల జీవితం, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలకమైన వేదిక అని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు సమకాలీన అంశాలు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, దేశ అభివృద్ధి, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, జనరల్ నాలెడ్జ్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తని, కేవలం ఉద్యోగాల కోసం కాకుండా సమాజం, రాష్ట్రం, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల ప్రశ్నలకు దివీస్ ల్యాబ్ డైరెక్టర్ నీలిమ సమాధానాలు
విద్యార్థి ప్రశ్న: మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
నీలిమ సమాధానం: “మా నాన్నగారి దగ్గర నుంచి నేను కష్టపడటం నేర్చుకున్నాను. మనకు తెలివి ఉన్నా లేకపోయినా, పట్టుదలతో కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. కష్టపడటమే విజయానికి ప్రధానమైన మార్గం అని ఆయన నుంచి నేర్చుకున్నాను” అని సమాధానమిచ్చారు.
విద్యార్థి ప్రశ్న: మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటి? దాన్ని ఎలా పరిష్కరించారు?
నీలిమ సమాధానం: “ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా దాన్ని ఒక సవాల్‌గా స్వీకరించాలి. ముఖ్యంగా పెద్ద సమస్యలను పరిష్కరించడంలో టీమ్‌వర్క్ ఎంతో కీలకం. అందరం కలిసి పనిచేస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. నా జీవితంలో కూడా సమస్యలు ఎదురైన ప్రతిసారీ నా టీమ్‌తో కలిసి ముందుకు సాగుతాను. వారి అభిప్రాయాలను తీసుకుని, అందరం కలిసి పరిష్కారం కనుగొంటాం” అని చెప్పారు.
విద్యార్థిని ప్రశ్న: మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు ఎంత పాకెట్ మనీ ఇచ్చేవారు? దాన్ని ఎలా ఖర్చు చేసేవారు?
నీలిమ సమాధానం: “కాలేజీలో చదువుతున్నప్పుడు మా అమ్మ నాకు నెలకు రూ.100 పాకెట్ మనీ ఇచ్చేవారు. ఆ డబ్బును ఎలా ఖర్చు చేశానో తప్పనిసరిగా లెక్క చెప్పాల్సి వచ్చేది. లెక్క చూపించిన తర్వాతే మరుసటి పాకెట్ మనీ ఇచ్చేవారు. లేకపోతే అమ్మ నన్ను గట్టిగా మందలించేవారు. అయితే మా నాన్నగారు మాత్రం ఈ విషయంలో నన్నేమీ అనేవారు కాదు” అని గుర్తు చేసుకున్నారు.
విద్యార్థిని ప్రశ్న: మీ దృష్టిలో అందం అంటే ఏమిటి?
నీలిమ సమాధానం: “అందం అనేది కేవలం ముఖంలో ఉండదు. నా దృష్టిలో అందం అంటే ఆనందం. ఒక మనిషిలో మనకు ప్రేమ, గౌరవం కనిపించినప్పుడే నిజమైన అందం కనిపిస్తుంది” అని తెలిపారు.
విద్యార్థిని ప్రశ్న: బిజినెస్ చేయాలనుకునే వారికి మీ సలహా ఏంటి?
నీలిమ సమాధానం: “ముందుగా ఒక స్పష్టమైన కల ఉండాలి. ఆ కలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలి. మన కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో కష్టపడితే జీవితంలో ఎక్కడికైనా వెళ్లగలం” అని సమాధానమిచ్చారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమాధానాలు
విద్యార్థి ప్రశ్న: మీరు గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారికి మీరు ఇచ్చే సలహా, సూచనలు ఏంటి?
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమాధానం: “మా ఇద్దరికీ గొడవ పెట్టాలని ప్లాన్ చేశావా? (నవ్వుతూ) ఒక విజనరీ లీడర్ దగ్గర మంత్రిగా పనిచేసే అవకాశం నాకు వచ్చింది. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. ఐదేళ్లలో దాదాపు 11 జాతీయ స్థాయి సంస్థలను తీసుకువచ్చాం. విదేశాలకు వెళ్లి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాం. 2019 తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దాన్ని తిరిగి గాడిలో పెట్టడం అంత సులభం కాదు. కానీ లోకేష్ గారు ఈ సవాల్‌ను స్వీకరించారు. పాదయాత్ర చేయవద్దని మేము చెప్పినా ఆయన చేశారు. మంగళగిరి నుంచి పోటీ చేయవద్దని చెప్పినా అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. మంత్రిగా మేము ఐదేళ్లలో నేర్చుకున్న విషయాలను ఆయన ఒక్క ఏడాదిలోనే నేర్చుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు కేటాయించిన సమయాన్ని పూర్తిగా విద్యార్థుల కోసమే కేటాయిస్తున్నారు. రాజకీయ నాయకులకు ఆ సమయాన్ని ఇవ్వడం లేదు. అందుకే ఆయనకు ప్రత్యేకంగా సలహా ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను” అని అన్నారు
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి నారాయణ గారిని, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారిని కలిశాను. అప్పుడు వారు నాకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. ప్రతి పాఠశాలలో ప్రాథమిక తరగతులకు ‘వన్ క్లాస్ – వన్ టీచర్’ విధానాన్ని తీసుకువస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. వారి సూచనను పరిగణనలోకి తీసుకుని ఆ విధానాన్ని అమలు చేశాం. ప్రస్తుతం 10 వేల పాఠశాలల్లో ‘వన్ క్లాస్ – వన్ టీచర్’ విధానం అమల్లో ఉంది” అని తెలిపారు.
దివీస్ ల్యాబ్స్‌కు మంత్రి లోకేష్ ప్రత్యేక ధన్యవాదాలు
చంద్రంపాలెం పాఠశాలను ఆధునీకరించేందుకు పిలుపునిచ్చిన వెంటనే.. ఖర్చు ఎంత అవుతుందనే ఆలోచన చేయకుండా ముందుకు వచ్చి పాఠశాలను ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసిన దివీస్ ల్యాబ్స్ డైరెక్టర్ నీలిమకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంతో కలిసి విద్యా రంగ అభివృద్ధికి దివీస్ ల్యాబ్స్ అందించిన సహకారం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఐఏఎస్, దివీస్ ల్యాబ్ సిబ్బంది, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.








