నారా లోకేష్ .. విద్యార్థుల్లో విద్యార్థిగా… టీచర్లలో టీచర్ గా…!
వాస్తవ సమస్యలను తెలుసుకునేదిశగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ప్రయత్నం
విశాఖ/విజయనగరం: సాధారణంగా దేశంలో ఎక్కడైనా ఏదైనా స్కూలుకు విద్యాశాఖ మంత్రి వస్తున్నారంటే జిల్లా అధికారి నుంచి మారుమూల టీచర్ వరకు హైఅలర్ట్ అయిపోతుంటారు. వాస్తవ సమస్యలు తెలిసిపోతాయోమోనని అధికారులు నానా హైరానా పడుతుంటారు. కానీ, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ రూటే సపరేటు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న లోకేష్… వ్యవస్థలో వాస్తవ సమస్యలను తెలుసుకునేందుకు తన హోదాను పక్కన బెట్టి వారితో మమేకమవుతున్నారు. విద్యార్థుల్లో విద్యార్థిలా, ఉపాధ్యాయుల్లో ఉపాధ్యాయుడిగా మారిపోతూ వారి మనోగతాన్ని తెలుసుకుంటున్నారు. విశాఖజిల్లా భీమిలి నియోజకవర్గం చంద్రంపాలెంలో దివీస్ ఆధ్వరాన ఆధునీకరించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రొటీన్ ఉపన్యాసాలకు భిన్నంగా విద్యార్థుల మనసు తెలుసుకునేందుకు మైక్ ఇచ్చి వారి ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. చిన్న పిల్లాడిలా మారిపోయి వారు వేసిన సరదా ప్రశ్నలకు అంతే ఖుషీగా సమాధానాలిచ్చారు. గతంలో తాను ఈ స్కూలుకు వచ్చినపుడు అక్కడి గ్రౌండ్ మోకాలి లోతులో మునిగి ఉంది. అప్పట్లో విద్యార్థుల మనోగతాన్ని తెలుసుకున్న లోకేష్ దివీస్ సంస్థను ఒప్పించి, అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం కార్పొరేట్ స్కూలును తలదన్నే విధంగా అధునాతన తరగతి గదులు, ల్యాబ్ లు, మినరల్ వాటర్ ప్లాంట్, ఆధునాతన ప్లేగ్రౌండ్ ఇక్కడ సమకూరాయి. ప్రస్తుతం అక్కడి సౌకర్యాలతో చిన్నారుల కళ్లలో ఆనందం చూసి మంత్రి లోకేష్ మురిసిపోయారు. ఇదిలావుండగా, విజయనగరం దాసన్న పేట బాలికోన్నత పాఠశాలలో స్కూలు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరైన లోకేష్… అక్కడ కెమిస్ట్రీ పునశ్చరణ తరగతులు జరుగుతుండగా, ఎటువంటి అవాంతరం కలిగించకుండా ఉపాధ్యాయులతో కలసి కూర్చుని శ్రద్ధగా ఆలకించారు. ఉపాధ్యాయులతో కలసిపోయి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై ఉన్నతాధికారులతో వ్యక్తి మాట్లాడారు. మంత్రి లోకేష్ ఆచరణాత్మక ఆలోచనా విధానంపై ఉపాధ్యాయులు, టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.








