డీఎస్సీపై జగన్‌కు ఐదోసారి సవాల్.. టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్ .. చర్చకు నేను సిద్ధం..!
టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక..
కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది
కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలి
విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో టిడిపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపు
విజయనగరం:- తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలు తనను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదని, కష్టపడే కార్యకర్తలను తానే వెతుక్కుంటూ వస్తానని స్పష్టం చేశారు. విజయనగరం నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రజలతో మమేకం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ… విజయనగరం టీడీపీకి కంచుకోట అని పేర్కొన్నారు. విజయనగరం విద్యాలయాల నగరంగా, గొప్ప వ్యక్తులు పుట్టిన భూమిగా, పైడితల్లి అమ్మవారి పుణ్యభూమిగా ప్రత్యేకత కలిగి ఉందన్నారు. గజపతి రాజుల సేవలు, దాతృత్వం కారణంగా విజయనగరం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు.
ప్రజా శ్రేయస్సే అదితి గజపతి రాజు నిరంతర ఆలోచన
“విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అసెంబ్లీలో అదితి గారు ప్రతిరోజూ మూడు సార్లు నా వద్దకు వచ్చి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి గురించే చెప్తుంటుంది. నాకు ఇది చేయండని స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఎవర్నీ అడగలేదు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తుంది. GMR–మాన్సాస్ ఎడ్యూసిటీ నిర్మాణానికి ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆమె పట్టుదలతో పనిచేస్తున్నారు. మన పిల్లలకు ఏవియేషన్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఎడ్యూసిటీకి 150 ఎకరాల భూమిని ఉచితంగా గజపతి రాజు కుటుంబం ఇవ్వడం గర్వకారణం” అని అన్నారు.
అశోక్ గజపతి రాజు సేవలు స్ఫూర్తిదాయకం
*పార్టీ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి అశోక్ గజపతి రాజు. ఆయన నానో కారులో తిరిగినా రాజసం మాత్రం రోల్స్ రాయిస్ లాగా ఉంటుంది. అశోక్ గజపతి రాజు గారిని చాలా ఇబ్బందులు పెట్టారు. అర్దరాత్రి అరెస్ట్ చేయాలని చూశారు. సింహాచలం ట్రస్ట్ నుండి తీసేయాలని చూశారు. రాముడి శిరస్సును తొలగించినప్పుడు చంద్రబాబు, అశోక్ గజపతి రాజు గారు వస్తుంటే లారీ అడ్డంపెట్టి అడ్డుకోవాలని చూశారు. బాబు గారిపైన, అశోక్ గజపతి రాజు గారిపైన అక్రమ కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెడితే మన నాయకులకు అంత బలం. నాపైనే 24 కేసులు పెట్టారు. మర్డర్ కేసు మాత్రమే నాపై పెట్టలేదు. అది కూడా పెట్టివుంటే నాలో మరింత కసి పెరిగేది.. గొడ్డలి పార్టీకి 11 కూడా వచ్చేవి కాదు” అని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
“గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించారు. ప్రజలు ఇచ్చిన విజయానికి ప్రతిఫలంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, రైల్వే జోన్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయాన్ని దేశంలోని అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తున్నాం. TCS, Cognizant, Infosys వంటి ప్రముఖ సంస్థలను ఉత్తరాంధ్రకు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉత్తరాంధ్రకు పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం” అని తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టండి
“ ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, పెట్టుబడులు రావడాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. Cognizant సంస్థకు భూ కేటాయింపును నిలిపివేయాలని వైసీపీ ఎంపి గురుమూర్తి కోర్టులను ఆశ్రయించడం ఇందుకు ఉదాహరణ. హైకోర్టు కూడా కాగ్నిజెంట్ సంస్థకు భూమి ఇస్తే తప్పేంటి అని చేసిన వ్యాఖ్యలు గొడ్డలి పార్టీకి చెంపపెట్టు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి. అభివృద్ధిని అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది” అని గుర్తు చేశారు.
కార్యకర్తలే పార్టీకి బలం
“కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 2025 మహానాడులో ‘కార్యకర్తే అధినేత’ అనే భావనకు ప్రాధాన్యత ఇచ్చాం. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారికి తగిన గౌరవం, బాధ్యతలు కల్పిస్తున్నాం. కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులను న్యాయబద్ధంగా తొలగించే చర్యలు చేపట్టాం., ఇప్పటికే 75 శాతం కేసులు న్యాయబద్ధంగానే పరిష్కరించాం. మిగిలిన కేసుల వివరాలను పార్టీ దృష్టికి తీసుకురావాలి, న్యాయపరంగా అండగా ఉంటాం. నీరు–చెట్టు బిల్లులు పెండింగ్‌లో ఉన్న కార్యకర్తలు వివరాలను పార్టీ దృష్టికి తీసుకురావాలి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. పార్టీలో అలకలకు స్థానం లేదు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన సంస్కరణలు తీసుకొస్తున్నాం. సామాన్య కార్యకర్తలే ఎంపీలు, పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యారు” అని లోకేష్ వివరించారు.
రప్ప రప్పా బ్యాచ్‌కు పార్టీలోకి నో ఎంట్రీ
“వైసీపీ రప్ప రప్ప అంటే చూస్తూ ఊరుకోం. చట్టాన్ని ఉల్లంఘిస్తే బొక్కలో వేసే బాధ్యత నాది. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. అందరినీ గుర్తు పెట్టుకున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనపై దుష్ప్రచారం చేసిన వాళ్లు గుర్తున్నారు. మన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు తిరిగి పార్టీలోకి రావాలని చూస్తున్నారు. వారికి నో ఎంట్రీ. ఇక్కడ హౌస్ ఫుల్” అని అన్నారు.
‘మై టీడీపీ’ యాప్ ద్వారా కార్యకర్తలకు పార్టీతో అనుసంధానం
“గ్రామస్థాయిలోని బూత్ అధ్యక్షుడి నుంచి జాతీయ నాయకత్వం వరకు పార్టీ కార్యకర్తలను అనుసంధానం చేయడానికి ‘మై టీడీపీ’ యాప్‌ను తీసుకొచ్చాం. కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజలు నిర్వహించే వ్యక్తిగత కార్యక్రమాలను కూడా యాప్‌లో నమోదు చేయాలి. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుని ప్రజలతో మమేకం కావాలి. కార్యకర్తలు నన్ను వెతుక్కుంటూ రావడం కాదు.. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే బాధ్యత నాది. కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించే బాధ్యత పార్టీదే” అని నారా లోకేష్ అన్నారు.
సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత
“రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలోనే అత్యధికంగా రూ.4 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనది. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం పథకం, మత్స్యకార భరోసా, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రోడ్ల నిర్మాణం, డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు, జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం” అని చెప్పారు.
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్
“DSC, APPSC మధ్య తేడా కూడా తెలియని స్థితిలో జగన్ ఉన్నాడు. DSC నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకు వెళ్ళి పిటిషన్లు వేశారు. కోర్టు కూడా ఎక్కడా కూటమి ప్రభుత్వాన్ని తప్పుబట్టలేదు. పారదర్శకంగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. జగన్ రెడ్డికి APPSCకి, డీఎస్సీకి తేడా తెలియదు. కనీస అవగాహన కూడా లేని వ్యక్తి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఐదేళ్ళలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక్క డీఎస్సీ విడుదల చేయలేదు, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో కూడా జగన్ కు అర్థం కాలేదు. అసెంబ్లీలో గొడ్డలి పార్టీ చేసే ప్రతి దుష్ప్రచారానికి సమాధానం చెప్పాను. డీఎస్సీపై చర్చిద్దామని జగన్‌కు ఛాలెంజ్ చేశాను. అయినా జగన్ రాలేదు. ఈరోజు కూడా ఐదోసారి ఛాలెంజ్ చేస్తున్నా. టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్. డీఎస్సీపై చర్చకు రా..! తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోవడం కాదు. బయటి రా..! ఐదేళ్ళు వేచి చూసి కష్టపడి టెట్, డీఎస్సీ రాసి ఎంపికైన ఉపాధ్యాయులను జగన్ అవమానిస్తున్నారు. జగన్ చెప్పిన అబద్ధాలను కార్యకర్తలు తిప్పికొట్టాలి” అని లోకేష్ పిలుపునిచ్చారు.
ప్రజలతో మమేకమే కార్యకర్తల ప్రధాన బాధ్యత
“2019లో మంగళగిరిలో ఓటమిని సవాల్‌గా తీసుకుని ప్రజల్లో నిరంతరం ఉన్నాను. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం వల్ల నాకు, మంగళగిరి ప్రజలకు మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. 2024లో మంగళగిరి ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం మాత్రమే కాకుండా, ప్రతి కార్యకర్త ప్రజలతో వ్యక్తిగతంగా మమేకం కావాలి. అప్పుడే పార్టీకి, ప్రజలకు మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. సమస్యలపై పోరాడండి. పరిష్కారం అయ్యే వరకు వదలకండి. ప్రజలకు, మనకు మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
“త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. కూటమి పార్టీల మధ్య చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ సమన్వయంతో ముందుకు సాగాలి. కూటమి ఐక్యతను దెబ్బతీసేలా గొడ్డలి పార్టీ చేస్తున్న ప్రలోభాలకు ఎవ్వరూ లొంగవద్దు. రాబోయే ఎన్నికల్లో గత విజయాల కంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలి” అని కోరారు.
కష్టపడి పనిచేద్దాం.. ప్రజల్లో మమేకమవుదాం
“అధికారం ఉందనే అహంకారం ఎవరికీ ఉండకూడదు. ప్రజలే అంతిమ నిర్ణేతలని గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కుటుంబ సభ్యులే, ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజల కోసం పనిచేద్దాం.. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్దాం.. కార్యకర్తల కష్టానికి గుర్తింపు ఇద్దాం.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం” అని నారా లోకేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి గజపతి రాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీదేవి, విజయనగరం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, నియోజకవర్గ పరిశీలకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ప్రతి కార్యకర్తతో నారా లోకేష్ ఫొటో దిగారు.








