లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్‌లోని ప్రసిద్ధ అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించారు.
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1921-22లో లండన్‌లోని ప్రిమ్రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్లో నివసించిన ఇంటిని సీఎం సందర్శించారు.
“మహనీయులు డాక్టర్ అంబేడ్కర్ గారి హౌస్‌ను సందర్శించడం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం లాంటిది. ఇది జీవితకాలపు స్ఫూర్తినిస్తుంది. సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలన్న నా ఆకాంక్ష మరింత పెరిగింది” అని సీఎం రేవంత్ రెడ్డి సందర్శకుల డైరీలో రాశారు.
అంబేడ్కర్ హౌస్‌ను ప్రస్తుతం డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలకు అంకితమైన మ్యూజియంగా ఏర్పాటు చేశారు. రాజ్యాంగబద్ధత, సమానత్వం, కులరహిత సమాజం, అణచివేత లేని సమాజం, సామాజిక న్యాయానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం వంటి ఆయన సిద్ధాంతాలను ఈ మ్యూజియం ప్రతిబింబిస్తుంది.
దాదాపు గంటపాటు సాగిన పర్యటనలో అంబేడ్కర్ మ్యూజియం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ (ACDA) చైర్ Ms. సంతోష్ దాస్ MBE, యూకేలో బాబాసాహెబ్ జీవితానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.
పర్యటన పూర్తయిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి. భారతీయుల్లో గొప్ప వ్యక్తుల్లో ఒకరైన డాక్టర్ అంబేద్కర్ జీవితంలోని వ్యక్తిగత కోణాన్ని చూసి, ఆయనతో ముడిపడిన వస్తువులను తాకగలగడం ఎంతో గొప్ప అనుభూతి” అని అన్నారు.








