రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ దూకుడు: దేశవ్యాప్తంగా తగ్గినా ఇక్కడ మాత్రం 15% వృద్ధి
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి) మార్కెట్ మందగమనంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ మాత్రం తన దూకుడును కొనసాగిస్తోంది. స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ ‘ప్రాప్‌టైగర్’ (PropTiger) తాజాగా విడుదల చేసిన ‘రియల్ ఇన్సైట్’ (Real Estate) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అగ్రగామి 8 నగరాల్లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 6 శాతం క్షీణించగా, హైదరాబాద్ మార్కెట్ మాత్రం ఏకంగా 15 శాతం వృద్ధిని నమోదు చేసి సత్తా చాటింది.
విక్రయాల గణాంకాలు
దేశంలోని ముంబయి, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు మందగించగా, కేవలం హైదరాబాద్, చెన్నై నగరాలు మాత్రమే వృద్ధిని సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హైదరాబాద్‌లో 13,196 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 11,513 విక్రయాలతో పోలిస్తే ఇది 15 శాతం మేర వృద్ధి. అదే సమయంలో దేశవ్యాప్తంగా టాప్-8 నగరాల్లోని మొత్తం విక్రయాలను (Real Estate) పరిశీలిస్తే.. గతేడాది నమోదైన 97,674 ఇళ్ల నుంచి ఈసారి 6 శాతం క్షీణించి 91,729కి పడిపోయాయి.
మందగమనానికి కారణాలు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పశ్చిమాసియా సంక్షోభం, అలాగే ఐటీ రంగంలో ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం తీవ్రంగా పడుతుందనే ఆందోళనల నడుమ కొనుగోలుదార్లు ఇళ్ల కొనుగోలుపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బడ్జెట్, ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకోవడం వల్లే ఇతర ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు (Real Estate) నెమ్మదించినట్లు ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది.
పండుగ సీజన్‌పై ఆశలు
మార్కెట్ తాజా పరిస్థితులపై ప్రాప్‌టైగర్ సీఈఓ ప్రకాష్ తేజ్వానీ స్పందిస్తూ.. “స్థిరాస్తి మార్కెట్ బలహీనపడటం లేదు, అది మరింత పరిపక్వత సాధిస్తోంది. ప్రస్తుతం కొనుగోలుదార్లు నాణ్యమైన ఇళ్లనే ఎంచుకుంటున్నారు. వరుసగా రెండు త్రైమాసికాలుగా సగటు ధరలు చదరపు అడుగుకు రూ. 10,000 కంటే పైనే కొనసాగుతున్నాయి. రాబోయే పండగల సీజన్లో డెవలపర్లకు (Real Estate) ఖచ్చితంగా మంచి అవకాశాలు లభిస్తాయి” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








