Kalyan Chaubey: ఏఐఎఫ్ఎఫ్ చీఫ్ కల్యాణ్ చౌబేపై సంచలన వేధింపుల ఆరోపణలు!
భారత ఫుట్‌బాల్ క్రీడాలోకంలో సంచలనం రేగింది. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) బాస్, అధ్యక్షుడు కల్యాణ్ చౌబే (Kalyan Chaubey) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఏఐఎఫ్ఎఫ్ మహిళల ఫుట్‌బాల్ కమిటీ ఛైర్పర్సన్, గోవాకు చెందిన క్రీడా నిర్వాహకురాలు వాలంకా అలెమావో (Valanka Alemao) స్వయంగా చౌబేతో పాటు ఇతర సీనియర్ అధికారులపై వేధింపుల ఆరోపణలు చేశారు.
ఢిల్లీలో జరిగిన మీటింగ్‌లో టార్గెట్
తాజాగా మార్చి 29వ తేదీన ఢిల్లీలోని ‘ఫుట్‌బాల్ హౌస్’లో (Football House) జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ దురదృష్టకర పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భారత మహిళల ఆసియా కప్ (AFC Women’s Asian Cup) క్యాంపెయిన్‌లో జరిగిన పలు పాలనాపరమైన లోపాలను, అవకతవకలను ఆమె ఇటీవల ధైర్యంగా ఎత్తిచూపారు. ఆ కక్షతోనే సీనియర్ అధికారులు (Kalyan Chaubey) కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని మీటింగ్‌లో దారుణంగా హేళన చేశారని, మానసికంగా వేధించారని వాలంకా అలెమావో ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌కు ఘాటు లేఖ
తనకు ఎదురైన పరాభవం గురించి వాలంకా అలెమావో ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (Executive Committee) సభ్యులందరికీ ఒక ఘాటు లేఖ రాశారు. “అధ్యక్షుడు కల్యాణ్ చౌబే (Kalyan Chaubey), ఉపాధ్యక్షుడు ఎన్.ఏ. హారిస్, అలాగే డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ్.. ఆ సమావేశంలో ప్రవర్తించిన తీరును మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. సమావేశంలో మాట్లాడకుండా నా గొంతును అణచివేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఏఐఎఫ్ఎఫ్ చీఫ్ చౌబే నాతో అత్యంత అగౌరవంగా, దురుసుగా ప్రవర్తించారు. ఆయనకు వత్తాసు పలుకుతూ మిగిలిన అధికారులు కూడా స్వరం పెంచి, నన్ను భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపు ధోరణితో మాట్లాడారు. సమావేశం జరిగినంత సేపూ ముగ్గురూ నన్నే టార్గెట్ చేశారు” అని ఆ లేఖలో అలెమావో తన ఆవేదన వ్యక్తం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఎవరీ వాలంకా అలెమావో?
భారత ఫుట్‌బాల్ పాలకవర్గంలో వాలంకా అలెమావోకు ఎంతో గుర్తింపు ఉంది. గోవా మాజీ ముఖ్యమంత్రి (Former Goa CM) చర్చిల్ అలెమావో కుమార్తె అయిన ఆమె.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘చర్చిల్ బ్రదర్స్ ఫుట్‌బాల్ క్లబ్’ (Churchill Brothers FC) కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాలుగా ఆ క్లబ్ పురోగతిలో ఆమె కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌కు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా.. అత్యున్నత క్రీడా సంస్థ ‘ఫిఫా’ (FIFA) మహిళల ఫుట్‌బాల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యురాలిగా నియమితులైన మొట్టమొదటి భారతీయురాలిగా వాలంకా చరిత్ర సృష్టించారు. 2025 నుంచి 2029 వరకు ఆమె ఆ కీలక హోదాలో కొనసాగనున్నారు. మరి అలాంటి వ్యక్తి ఆరోపణల నేపథ్యంలో ఏఐఎఫ్ఎఫ్ (Kalyan Chaubey) ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందోనని క్రీడా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








