జైపూర్ వేదికగా రాజస్థాన్, ఢిల్లీ జట్ల మధ్య ఆసక్తికర పోరు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో(IPL) భాగంగా ఈరోజు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్-3లోకి దూసుకెళ్లాలని చూస్తోంది. మరోవైపు, ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ విజయం అత్యంత కీలకం. ఈ రెండు జట్ల మధ్య ముఖాముఖి రికార్డులను గమనిస్తే పోరు చాలా సమానంగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి
ఇప్పటివరకు జరిగిన 31 మ్యాచ్‌లలో ఢిల్లీ 16 సార్లు, రాజస్థాన్ 15 సార్లు విజయం సాధించాయి. అయితే, జైపూర్ హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్‌కు మంచి పట్టు ఉంది. ఇక్కడ జరిగిన గత ఏడు మ్యాచ్‌లలో రాజస్థాన్ ఐదుసార్లు గెలవగా, ఢిల్లీ కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించగలిగింది. నేటి మ్యాచ్‌లోనూ హోమ్ అడ్వాంటేజ్ రాజస్థాన్‌కే ఉండే అవకాశం ఉంది. నేటి మ్యాచ్‌లో కీలక ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి కళ్లు ఉన్నాయి. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఈ సీజన్లో ఇప్పటికే 400 పరుగులతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
అతడిని అడ్డుకోవడం ఢిల్లీ బౌలర్లకు పెద్ద సవాలు కానుంది. అలాగే రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో కీలకం కానున్నాడు. ఇక ఢిల్లీ జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్లను ఏ మేరకు అడ్డుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. పిచ్ రిపోర్ట్ ప్రకారం, జైపూర్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇరు జట్లలోని స్టార్ ప్లేయర్ల ఫామ్‌ను బట్టి చూస్తే, ఈ రాత్రి క్రికెట్ ప్రేమికులకు పసందైన వినోదం ఖాయమనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి






