ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఆగస్టు 10 తేదీతో ముగుస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో 790 మంది సభ్యులు ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారి నసీం జైదీ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారని తెలిపారు. జులై 4న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. జులై 4 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 19న అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.













