PC Ghosh Commission: కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక, దానిపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన జరిగిందన్న కోర్టు వ్యాఖ్యలతో ఈ నివేదిక భవితవ్యం ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడింది. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు దీనిని నైతిక విజయంగా భావిస్తుంటే, ప్రభుత్వం మాత్రం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటూనే తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.
హైకోర్టు వెలువరించిన తీర్పును నిశితంగా పరిశీలిస్తే, అది అటు ప్రభుత్వానికి, ఇటు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. కాళేశ్వరం అక్రమాలపై విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 6ను కోర్టు సమర్థించడం ప్రభుత్వానికి లభించిన ప్రాథమిక చట్టబద్ధ విజయం. అయితే విచారణా చట్టం సెక్షన్ 8బి ప్రకారం, ఎవరినైనా దోషులుగా నిర్ధారించే ముందు వారి వివరణ కోరడం తప్పనిసరి అని, కేసీఆర్, హరీష్ రావుల వాదనలు వినకుండానే కమిషన్ నివేదిక ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల నివేదికలోని చర్యల భాగం ప్రస్తుతానికి అమలు చేయడానికి వీలు లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆత్మరక్షణలో పడకుండా అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లేందుకు రెండు ప్రధాన మార్గాలను పరిశీలిస్తోంది. మొదటి ఆప్షన్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడం. కమిషన్ ఇప్పటికే సేకరించిన సాక్ష్యాధారాలు, ఇతర అధికారుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకుని, కేవలం నోటీసుల సాంకేతికత ఆధారంగా నివేదికను పక్కన పెట్టడం సరికాదని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే న్యాయ నిపుణులతో దీనిపై చర్చలు జరిపారు. క్యాబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఢిల్లీ వేదికగా పోరాడాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఒకవేళ సుప్రీంకోర్టులో ఊరట లభించకపోతే లేదా ప్రక్రియ వేగవంతం కావాలనుకుంటే ప్రభుత్వం రెండో ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అది హైకోర్టు సూచించిన లోపాలను సవరించడానికి జస్టిస్ ఘోష్ కమిషన్‌ను పునరుద్ధరించి అదనపు గడువు ఇవ్వడం. నిందితులుగా భావిస్తున్న వారికి అధికారికంగా నోటీసులు ఇచ్చి, వారి వాదనలను రికార్డు చేసిన తర్వాత సవరించిన నివేదికను సమర్పించడం ద్వారా విచారణకు పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తుంది.
ఈ పరిణామాలు తెలంగాణలో రాజకీయాన్ని హీటెక్కించాయి. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గితే అది రాజకీయంగా బలహీనతగా కనిపిస్తుంది. అందుకే పీసీ ఘోష్ కమిషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని వృధా కానివ్వకుండా, సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లడమే రేవంత్ సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు తమకు వాదన వినిపించే అవకాశం రావడం ద్వారా కాలయాపన చేసే ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేయడం వల్ల విచారణ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కాళేశ్వరం విచారణ ఇప్పుడు ఢిల్లీలోని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతుందా లేక హైదరాబాద్‌లోనే కొత్త నోటీసులతో పునఃప్రారంభమవుతుందా అనేది ప్రభుత్వ తదుపరి అడుగుపైనే ఆధారపడి ఉంది.








