BRS: తెలంగాణ ఆత్మగౌరవం… పేటెంట్ రైట్స్ బీఆర్ఎస్ వేనా..?
బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చూస్తే ఎప్పుడు కష్టాలు, సమస్యలు చుట్టుముట్టినా .. ఆపార్టీ నమ్ముకునేది తెలంగాణ సెంటిమెంట్. ఉద్యమ పార్టీగా మొదలై , ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. పదేళ్లపాటు పగ్గాలు చేపట్టింది.అప్పుడు ఎక్కడ చూసినా గులాబీ జెండాలే కనిపించేవి. పోలీసుల నుంచి అన్ని వ్యవస్థలు .. అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు స్పందించేవి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. వ్యవస్థలు కూడా.. ఇప్పటి ప్రభుత్వానికి అనుగుణంగా నడుస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ .. ఇరిటేట్ అవుతున్నట్లు కనిపిస్తోంది..
ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యవహారం కాస్తా ఇప్పుడు కేసీఆర్ వరకూ వెళ్లింది. ఈ కేసులో ఆరోపణలపై సిట్ బృందం.. గులాబీ అధినేత కేసీఆర్ ను విచారించింది. ఇది బీఆర్ఎస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. చావు నోట్లో తలపెట్టి, ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ ను.. సిట్ విచారణకు రమ్మంటారా అని ఆపార్టీ సీనియర్ నేతలు సైతం ఆక్షేపించారు. అంతేకాదు… ఇది కక్ష పూరితమంటూ ఆగ్రహించారు కూడా.
అయితే చట్టం ముందు అందరూ సమానమే. గతంలో సీఎంలుగా ఉన్న సమయంలో హేమాహేమీలు జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్, షిబు సొరెన్ సహా పలువురు దర్యాప్తు సంస్థల ముందు విచారణకు హాజరయ్యారు. కొందరు సీఎంలుగా ఉన్న సమయంలో అరెస్టయ్యారు కూడా. అది భారత చట్టం, రాజ్యాంగం ప్రకారం జరిగింది . అలాంటప్పుడు కేసీఆర్ కు మాత్రం ఎందుకు మినహాయింపు ఉంటుంది. ఆ విషయం బీఆర్ఎస్ నేతలకు తెలిసినా.. తెలియనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.
ఇక కేసీఆర్ ను టచ్ చేస్తే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లు అని మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. పదేళ్లు గడిచాయి. ఇంకా ఆత్మగౌరవమంటూ.. ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడడంపై .. తెలంగాణ ఉద్యమ కారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తప్పు చేయకుంటే.. విచారణకు సహకరించి, శుద్ధపూసలా బయట పడాలని వారు చెబుతున్నారు. అంతేకానీ.. తమనేతను విచారణ చేయకూడదన్నట్లు వ్యవహరించొద్దన్నది వారు సూచనగా ఉంది.






