ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నిండా మునిగారా…? సిట్ విచారణ ఎలా జరిగింది..?
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసు (PhoneTapping Case) విచారణ కీలక దశకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నాలుగున్నర గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన ఈ విచారణలో కేసీఆర్‌కు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
పక్కా ఆధారాలతో కేసీఆర్ విచారణ..?
గతంలో సాక్షులిచ్చిన ఆధారాలు ముందు పెట్టి మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకూ అన్ని అంశాలపైనా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయనే విషయంపై, నిర్ణయ ప్రక్రియలో కేసీఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ ఎప్పటినుంచి మొదలైంది..?
ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా..? అని కేసీఆర్‌ని సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.‘ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా?’ అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలైంది..? అనే విషయాలపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీశారు.
ఫోన్లు ట్యాప్ చేశారా..?
‘ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు?, అది సాధారణ భద్రత కోసమా..? లేక రాజకీయ అవసరాల కోసమా..?’ అంటూ పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా..?.. వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా..? అంటూ సిట్ అధికారులు నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలపై కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఈ కేసులో తమ దర్యాప్తునకు కీలకంగా మారనున్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ప్రభాకర్‌రావు పదవీకాలంపై విచారణ..
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీకాలం ముగిసిన ప్రభాకర్‌రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు..? ఆ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి..? అంటూ కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు..?, పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి రెండు కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు..?, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా..? అనే కోణంలో సిట్ విచారణ కొనసాగినట్లు సమాచారం.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ‘మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది?, ఆ సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా..? అనే అనుమానాలతో అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీ ఫండ్‌తో ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు..? చేశారా అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ ఫండ్‌ను కేటాయించారా..? ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ డబ్బులు ఎందుకు ఉపయోగించారు..? అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.






