ప్రయాణికులకు కష్టాలు.. ప్రైవేటు వాహనదారులకు కాసులు!
Hyderabad: హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె సామాన్య ప్రయాణికులకు శాపంగా మారింది. బస్సులు రోడెక్కకపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోగా, దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వాహనదారులు భారీగా లాభపడుతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద వేల సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
భారీ ధరల ఛార్జీలు..
సాధారణంగా ఖైరతాబాద్ నుండి అమీర్పేట మెట్రో స్టేషన్కు 120 రూపాయలు ఉండే క్యాబ్ ఛార్జీలు, ప్రస్తుతం 210 రూపాయలకు పైగా పెరిగాయి. ఆన్లైన్ ట్యాక్సీ అగ్రిగేటర్లు సైతం సమ్మెను సాకుగా చూపి భారీగా ధరలను పెంచేస్తున్నాయి.
అదనపు డబ్బులు డిమాండ్..
రైడ్ బుక్ చేసుకున్న తర్వాత కూడా ప్రైవేటు డ్రైవర్లు ఫోన్ చేసి అదనపు డబ్బులు అడుగుతున్నారని, ఇస్తేనే వస్తామని డిమాండ్ చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.షేర్ ఆటోలు , బైక్ ట్యాక్సీలు కూడా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటూ అధిక వసూళ్లకు పాల్పడుతున్నాయి.
బస్సుల కోసం పడిగాపులు ..
సొంత వాహనాలు లేని మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు , వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయాల్లో బస్సుల కోసం పడిగాపులు కాయడం దయనీయంగా మారింది. నగరంలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించడంతో, చేసేదేమీ లేక చాలామంది ‘సెట్విన్’ బస్సుల్లో ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ , ప్రైవేటు వాహనదారులు మానవత్వంతో వ్యవహరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.








