తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్.. రేపే ప్రారంభం
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ నుంచి శనివారం (ఈ నెల 8న) పచ్చజెండా పూరి ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులు విమాన తరహా ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి-సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయల్దేరి రాత్రి 11:45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది.













