Jeevan Reddy: ఫలించని మంత్రుల బుజ్జగింపులు.. 25న జీవన్ రెడ్డి రాజీనామా!?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి జగిత్యాల పులిగా పేరుగాంచిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిపైనే ఉంది. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన విధేయత కలిగిన ఒక ధీశాలి.. ఇప్పుడు అదే పార్టీకి ‘గుడ్ బై‘ చెప్పే దిశగా అడుగులు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అయితే జీవన్ రెడ్డిని పార్టీ వీడకుండా చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. జీవన్ రెడ్డి ఇంటికెళ్లి బుజ్జగింపులు చేశారు. అయితే అవి ఫలించలేదు.
జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత చేజారితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీకి భారీ నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ హైకమాండ్.. మంత్రులను పంపించింది. జీవన్ రెడ్డి నివాసంలో వీళ్లు గంటల తరబడి చర్చలు జరిపారు. “మీరు పార్టీకి మూలస్తంభం, మీ గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం” అని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, జీవన్ రెడ్డి మాత్రం మెత్తబడలేదు. తన అనుచరులపై కేసులు పెట్టడం, అభివృద్ధి పనుల్లో తనను పక్కన పెట్టడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, “ఇక గౌరవం లేని చోట ఉండలేను” అని కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పార్టీ వీడేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారన్న సమాచారం వినగానే ప్రత్యర్థి పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఆయన్ను తమ పార్టీలోకి లాగేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో ఆయన చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డికి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సముచిత స్థానంతో పాటు, పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు టాక్. 25న ఆయన కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.
మరోవైపు బీజేపీ కూడా జీవన్ రెడ్డి లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేత కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. హిందుత్వ ఓటు బ్యాంక్‌కు జీవన్ రెడ్డి వ్యక్తిగత చరిష్మా తోడైతే, ఉత్తర తెలంగాణలో తిరుగుండదని బీజేపీ వ్యూహం. అయితే బీజేపీలో చేరికపై ఆయన ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది.
జీవన్ రెడ్డి గనుక కాంగ్రెస్‌ను వీడితే, అది కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్‌పై ప్రభావం పడుతుంది. ఆయనతో పాటు వందలాది మంది ముఖ్య అనుచరులు, స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీ వీడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి








