కోర్టుల చుట్టూ తిరిగే పని లేదు.. ఈ ఒక్క పోర్టల్‌తో మీ సమస్యకు పరిష్కారం
e-Jagriti Portal : వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక అయిన ‘ఇ-జాగృతి’ (e-Jagriti) పోర్టల్, స్వయంగా ఫిర్యాదు చేయాలనుకునే దరఖాస్తుదారులకు ఒక ఉత్తమ మార్గదర్శిగా నిలుస్తోంది. లాయర్ల సహాయం లేకుండానే సామాన్యులు సైతం ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకునేలా ఈ డిజిటల్ వ్యవస్థ తోడ్పడుతోంది. ఇందులో ప్రత్యేకంగా పొందుపరిచిన ‘హెల్ప్ డాక్యుమెంట్స్’ విభాగం.. దరఖాస్తు ప్రక్రియలోని ప్రతి దశలోనూ అవసరమైన పత్రాలు, నమోదు విధానాలపై వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పిస్తోంది.
స్క్రీన్షాట్లతో సహా..
ఈ పోర్టల్‌లోకి కొత్తగా ప్రవేశించే వినియోగదారులు ఓటీపీ (OTP) ఆధారంగా తమ పేరును ఎలా నమోదు చేసుకోవాలో , ప్రొఫైల్‌ను ఎలా పూర్తి చేయాలో ఈ వ్యవస్థ వివరిస్తుంది. వినియోగదారులు తమ మొదటి ఫిర్యాదు లేదా అప్పీల్‌ను దాఖలు చేసేటప్పుడు అనుసరించాల్సిన వివిధ దశలను స్క్రీన్షాట్లతో సహా ఈ పోర్టల్ సులభంగా చూపిస్తుంది.
ఆన్లైన్ పేమెంట్ గేట్‌వేల ద్వారా
ఫిర్యాదుకు అవసరమయ్యే ఇండెక్స్ సినాప్సిస్, అఫిడవిట్, వకాలత్‌నామా వంటి ముఖ్యమైన పత్రాలను పీడీఎఫ్ (PDF) రూపంలో ఎలా అప్లోడ్ చేయాలో కూడా ఇందులో మార్గదర్శకత్వం ఉంటుంది. దీనితో పాటు కోర్టు ఫీజులను ‘పే గవ్’ (Pay Gov) లేదా ఇతర ఆన్లైన్ పేమెంట్ గేట్‌వేల ద్వారా సులభంగా ఎలా చెల్లించవచ్చో పోర్టల్ తెలియజేస్తుంది.
తప్పులను ఎడిట్ చేసుకునే అవకాశం..
ఫిర్యాదును పూర్తిగా సబ్మిట్ చేయడానికి ముందు ‘ప్రివ్యూ’ ఆప్షన్ ద్వారా వివరాలను ఒకసారి సరిచూసుకోవచ్చు. ఏవైనా తప్పులు దొర్లితే వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమర్పించిన తర్వాత లభించే రిఫరెన్స్ నంబర్ ద్వారా కేసు ప్రస్తుత స్థితిని (Status), రోజువారీ కోర్టు ఉత్తర్వులను ఆన్లైన్లోనే ట్రాక్ చేయవచ్చు.
రివిజన్ పిటిషన్ దాఖలు చేసే విధానం..
జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పుపై సంతృప్తి చెందకపోతే, రాష్ట్ర కమిషన్‌కు ఎలా అప్పీల్ చేయాలో వివరించడంతో పాటు దానికి కావాల్సిన పత్రాల సమాచారాన్ని అందిస్తుంది. అలాగే చట్టపరమైన లోపాలు లేదా అధికార పరిధి సమస్యలపై ఉన్నత కమిషన్‌లో రివిజన్ పిటిషన్ దాఖలు చేసే విధానాన్ని వివరిస్తుంది. అప్పీలు చేసుకునే అవకాశం లేనప్పుడు, రాష్ట్ర లేదా జాతీయ వినియోగదారుల కమిషన్లలో దీనిని ఉపయోగించవచ్చు.
కాలపరిమితి పొడిగింపునకు..
సాధారణంగా నిర్దేశిత సమయం (2 ఏళ్లు) దాటిన తర్వాత కేసు ఫైల్ చేయాల్సి వస్తే, ఆ ఆలస్యానికి గల కారణాలను విశ్లేషిస్తూ దరఖాస్తు ఎలా చేయాలో కూడా ఈ పోర్టల్ స్పష్టంగా తెలియజేస్తుంది.
వివరాలు అంకెల్లో (జిల్లాల వారీగా కేసుల స్థితి)
వినియోగదారుల కమిషన్లలో నమోదైన , పరిష్కారమైన కేసుల వివరాలను పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 9,135 కేసులు నమోదు కాగా 7,173 కేసులు పరిష్కారమయ్యాయి. హైదరాబాద్-1 పరిధిలో 6,858 కేసులకు గాను 6,163 కేసులు, హైదరాబాద్-2 పరిధిలో 6,655 కేసులకు గాను 6,177 కేసులు, , హైదరాబాద్-3 పరిధిలో 6,132 కేసులకు గాను 5,634 కేసులు పరిష్కారమయ్యాయి.








