సెకండ్ హ్యాండ్ వాహనం కొంటున్నారా? పోలీసుల కీలక మార్గదర్శకాలు ఇవే
Vehicle: నగరంలో చోరీ చేసిన వాహనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు, పాత వాహనాలను కొనుగోలు చేసే వారు మోసపోకుండా ఉండేందుకు నగర పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో, సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, నగర పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయాలు తీసుకుని, వాహన కొనుగోలుదారుల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. యజమాని వివరాల ధ్రువీకరణ లేకుండా వాహనాలను కొనడం, మీటర్ రీడింగ్‌ను మార్చడం లేదా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో ప్రకటనలు ఇచ్చి మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కేంద్ర రవాణా శాఖ నిబంధనల ప్రకారం, సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లేదా సంస్థ తప్పనిసరిగా ఆర్టీఓ కార్యాలయం నుంచి లైసెన్స్ పొంది ఉండాలి.
కొనుగోలుదారులు పాటించాల్సిన జాగ్రత్తలు..
వాహనాన్ని కొనుగోలు చేసే ముందు, అది చోరీకి గురైనదా, బ్లాక్ లిస్ట్‌లో ఉందా లేదా ఏదైనా ప్రమాదానికి గురైనదా అనే విషయాలను ‘వాహన పోర్టల్’ ద్వారా నిర్ధారించుకోవాలి. వాహనంపై పెండింగ్ చలానాలు, రోడ్డు పన్ను , టోల్గేట్ బకాయిలు ఏవీ లేకుండా చూసుకోవాలి. వాహనం కొనే ముందు విక్రేతకు చెందిన ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు పత్రం కాపీని తీసుకోవాలి. వాహనం ఆర్సీ (RC) లో ఉన్న పేరు, చిరునామాను సరిచూసుకోవాలి. యజమాని కాకుండా ఇతరులు విక్రయిస్తుంటే, వారి దగ్గర ఉన్న ‘పవర్ ఆఫ్ అటార్నీ’ పత్రాలను పరిశీలించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలైతే తప్పనిసరిగా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) కలిగి ఉండాలి. ఒకవేళ వాహనం గుర్తింపు నంబర్లు ట్యాంపరింగ్ చేసినా లేదా అవి లేకపోయినా, అటువంటి వాహనాన్ని దొంగిలించినదిగా భావించి పోలీసులు వెంటనే సీజ్ చేస్తారు. విక్రేత వివరాలు సంతృప్తికరంగా లేకపోతే, అటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడం లేదా వాటికి ప్రచారం కల్పించడం పూర్తిగా నిషేధమని ప్రజలు గుర్తించాలి.








