అభివృద్ధిని అడ్డుకుంటే బరాబర్ సంగతి తేలుస్తాం.. కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు
హైదరాబాద్: భాగ్యనగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు (RRR) వంటి నగర ప్రతిష్టాత్మక ప్రగతి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావాలనే అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉప్పల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కిషన్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలను మానుకోవాలని, ఈనెల 15వ తేదీ తర్వాత ఆయన సంగతి బరాబర్ తేలుస్తామని ఘాటుగా హెచ్చరించారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోవడానికి, అన్ని అనుమతులు వచ్చినా విస్తరణ పనుల కాళ్లలో కట్టెలు పెట్టి ఆపడానికి కేంద్ర మంత్రి వైఖరే కారణమని సీఎం దుయ్యబట్టారు. మెట్రోకు క్లియరెన్సులు, మూసీ ప్రక్షాళనకు కేంద్ర నిధులు తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక ఎంపీగా కిషన్ రెడ్డికి లేదా అని ఆయన నిలదీశారు.
ఇవి కూడా చదవండి
ధాన్యం కొనుగోళ్లలోనూ అన్యాయం..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, మిగిలిన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ బాధ్యతను కేంద్రంతో ఒప్పించేందుకు కిషన్ రెడ్డి ఎందుకు ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం తాను గత రెండున్నరేళ్లలో 50 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశానని, దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర మంత్రిపై ఉందన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై చర్చలకు రాకుండా తప్పించుకోవడానికి కిషన్ రెడ్డే వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చీకటి ఒప్పందాలు, కేవలం ఉపన్యాసాలు దంచడం ఆపి, తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీ పెద్దల దగ్గరకు తనను తీసుకువెళ్లి నిధులు ఇప్పిస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి ఘనంగా సన్మానం చేస్తానన్నారు. ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు మాట్లాడతామని, ప్రగతి విషయంలో ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా నగర అభివృద్ధి కోసం బాధ్యతగా పని చేస్తానని స్పష్టం చేశారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్..
ఈ సభ వేదికగా ఉప్పల్ పరిధిలో రూ.1600 కోట్ల విలువైన పలు ప్రగతి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. హైదరాబాద్ నగరంలో గతంలో వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల అభివృద్ధి కుంటుపడిందని, దీనిని సరిదిద్ది అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ (Telangana Rising 2047) విజన్ డాక్యుమెంట్‌ను తెచ్చిందని ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల నివసిస్తున్న కోటి 30 లక్షల మంది ప్రజల అవసరాల కోసం, పరిపాలన సౌలభ్యం కోసమే క్యూర్ (Core) ప్రాంతాన్ని విభజించి కొత్తగా మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఇది ఎన్నికల స్టంట్ కాదని, పోలీస్ మున్సిపల్ పరిధులను ఒకేతాటిపైకి తెచ్చే పరిపాలనా వికేంద్రీకరణ అని స్పష్టం చేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.
100 రోజుల్లో మూసీ ప్రక్షాళన యాక్షన్ ప్లాన్
గుజరాత్లో సబర్మతి, యూపీలో గంగా నది తరహాలోనే తాము గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయ స్వార్థంతో అడ్డుపడుతున్నాయని సీఎం మండిపడ్డారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ‘ఫేజ్-2’ లో భాగంగా రాబోయే వంద రోజుల్లోనే మూసీ ప్రక్షాళన కార్యాచరణ మొదలవుతుందని స్పష్టం చేశారు. మూసీ మురికి వల్ల స్థానికంగా భూముల రేట్లు పెరగడం లేదని, నల్గొండ జిల్లాలో కాలుష్యం కారణంగా ఆడబిడ్డలు కడుపుకోతకు గురవుతూ తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజల పిలుపు మేరకే తాను గతంలో పాదయాత్ర చేశానని, అక్కడ ఇళ్లు కోల్పోయే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి, పిల్లలను ఉచితంగా చదివిస్తామన్నా కొందరు అడ్డుపడటం దారుణమన్నారు.
ఇదే తరుణంలో, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, తాము రాజకీయ కక్షసాధింపులు చేయకుండా, ఉప్పల్ ప్రాంతానికి 40 ఏళ్ల పాటు సేవలందించిన బండారు రాజిరెడ్డి జ్ఞాపకార్థం ఇక్కడి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆయన పేరే పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఉదాహరణగా పేర్కొన్నారు. మహిళల ఆశీస్సుల వల్లే తాను జెడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని, గతంలో కొడంగల్‌లో ఓడిపోయిన తరుణంలో తనను ఎంపీగా గెలిపించి రాజకీయంగా నిలబెట్టిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేలా నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానని సీఎం పునరుద్ఘాటించారు.








