Telangana: భద్రాద్రిలో గోత్రం రగడ.. నేడు హైకోర్టులో రామయ్య ‘నామ’ విచారణ!
Bhadrachalam: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమవుతున్న వేళ, స్వామివారి గోత్ర నామాలకు సంబంధించిన పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రాద్రిలో కొలువై ఉన్నది ‘దశరథ రాముడా’ లేక ‘వైకుంఠ రామ నారాయణుడా’ అనే అంశంపై భక్తులు, పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టులో జరగబోయే విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
వివాదానికి కారణాలు:
గోత్ర మార్పిడిపై అభ్యంతరం: 2012 వరకు శ్రీరాముడిని ‘దశరథ పుత్రుడిగా’, ‘వశిష్ట గోత్రుడిగా’ పూజించేవారని, సీతమ్మను ‘గౌతమస గోత్రం’గా వ్యవహరించేవారని పండితులు గుర్తుచేస్తున్నారు. అయితే, ఆ తర్వాత రాముడిని ‘రామనారాయణుడిగా’ మారుస్తూ, విష్ణుమూర్తికి సంబంధించిన ‘అచ్యుత గోత్రాన్ని’, సీతమ్మకు లక్ష్మీదేవి గోత్రమైన ‘సౌభాగ్య’ను ఉపయోగిస్తున్నారని ప్రధాన ఆరోపణ.
ఇవి కూడా చదవండి
శాస్త్ర విరుద్ధమని ఆవేదన: శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయాలను, చల్లా లక్ష్మీనరసింహశాస్త్రి రాసిన ‘కల్యాణోత్సవ ప్రయోగానుక్రమణిక’ గ్రంథంలోని విధులను మార్చడం ధార్మిక శాస్త్రాలకు విరుద్ధమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టులో నివేదిక అంశం: ఈ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు కోర్టు నియమించిన ఐదుగురు పండితుల కమిటీ 2024లోనే నివేదికను దేవాదాయ శాఖకు సమర్పించింది. అయితే, ఆ నివేదికను ఇంతవరకు బయటపెట్టకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నేటి విచారణలో ఈ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రధాన అర్చకుడి తొలగింపునకు డిమాండ్:
మరోవైపు, భద్రాద్రి ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కోడలి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు కావడం, ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయడం తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చేతుల మీదుగా స్వామివారి కల్యాణం జరగడం శాస్త్ర సమ్మతం కాదని, ఆయనను కల్యాణ విధులకు పూర్తిగా దూరం పెట్టాలని అఖిల భారత శ్రీరామ భక్త సేవా సంఘం డిమాండ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి








