ఏపీలో పెట్రోల్ కాదు, ప్రభుత్వమే లేదన్న షర్మిల..!
ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోల్(Petrol Shortage), డీజిల్ కొరతపై కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి(Ys Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదని, కనీసం ప్రజలకు ఇంధనం కూడా అందించలేని దుస్థితిలో కూటమి పాలన సాగుతోందని ఆమె మండిపడ్డారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె పాలకుల తీరును ఎండగట్టారు. దేశంలో ఎక్కడా లేని ఇంధన కొరత ఒక్క ఏపీలోనే ఏర్పడినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సిగ్గుపడాలని దుయ్యబట్టారు.
ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతా అన్నట్లుంది ప్రభుత్వ తీరు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం బంకులు మూతపడటం అత్యంత దారుణమని, ఎర్రటి ఎండలో కిలోమీటర్ల మేర ప్రజలను క్యూలో నిలబెట్టడం కూటమి ప్రభుత్వం ప్రజలకు విధించిన శాపమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మద్దతు ఇచ్చి కింగ్ మేకర్లుగా చలామణి అవుతున్న ఏపీ పాలకులకు, రాష్ట్రానికి తగినంత ఇంధనాన్ని తెచ్చుకునే దమ్ము లేకపోవడం బాధాకరమని షర్మిల వ్యాఖ్యానించారు.
సమీక్షలు, సలహాలతో కాలయాపన చేస్తే సమస్య తీరదని, అమ్మకాలు పెరిగాయనే సాకుతో ప్రజలను మసిపూసి మారేడు కాయ చేయవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఇంధన అత్యవసర పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంధన కొరత వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరగకుండా చూడాలని స్పష్టం చేశారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండేలా ప్రభుత్వం 24 గంటల డెడ్ లైన్ పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి







